Telugu Global
Telangana

టీపీసీసీ పదవి వాళ్లకే.. తేల్చేసిన హైకమాండ్‌.!

ఎస్సీ వర్గానికి పీసీసీ పదవి ఇవ్వాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. బీసీ కమ్యూనిటీ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని సమాచారం.

టీపీసీసీ పదవి వాళ్లకే.. తేల్చేసిన హైకమాండ్‌.!
X

తెలంగాణ పీసీసీగా ఉన్న రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తర్వాతి పీసీసీ ఎవరనేదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. రేవంత్ తర్వాత బీసీ నాయకుడికి పీసీసీ ఇవ్వాలని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, రెడ్డి వర్గాల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ బీసీకే కట్టాబెట్టాలని AICC పెద్దలు ఆలోచిస్తున్నారని సమాచారం. పీసీసీ పదవికి పూర్తిస్థాయి సమయం కేటాయించే విధేయుడి కోసం హైకమాండ్‌ వెతుకుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ నియామకం లోక్‌సభ ఎన్నికల తర్వాత, ముందా అనేది అధిష్టానం నిర్ణయించాల్సి ఉంది.

పీసీసీ పదవి కోసం బీసీ వర్గానికి చెందిన పలువురు నేతలు రేసులో ఉండగా.. ప్రముఖంగా ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌లతో కూడిన షార్ట్ లిస్ట్‌ను పార్టీ హైకమాండ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మధు యాష్కి, వీహెచ్‌ పేర్లు వినిపించినప్పటికీ.. వారు రేసు నుంచి తప్పించుకున్నారని సమాచారం.

ఎస్సీ వర్గానికి పీసీసీ పదవి ఇవ్వాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. బీసీ కమ్యూనిటీ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని సమాచారం. తెలంగాణ జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నారు. మున్నూరు కాపు, గౌడ్, ముదిరాజ్‌, యాదవ/కురుమలు బీసీల్లో ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గాలు. సీఎం రేవంత్ వర్గంలో ఇద్దరు మంత్రులు బీసీ సామాజికవర్గాల నుంచి ఉన్నారు. గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్‌, పద్మశాలి సామాజిక వర్గం నుంచి కొండా సురేఖ కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు.

First Published:  15 Jan 2024 5:41 AM GMT
Next Story