Telugu Global
Telangana

తెలంగాణకు మళ్లీ ప్రియాంక.. ఈసారి బీసీ డిక్లరేషన్

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు గాంధీ భవన్‌ లో టీపీసీసీ విస్తృత సమావేశం జరగాల్సి ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జూన్-2న ప్రతి గ్రామంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

తెలంగాణకు మళ్లీ ప్రియాంక.. ఈసారి బీసీ డిక్లరేషన్
X

కర్నాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఇటీవల తెలంగాణలో ప్రియాంక గాంధీ తొలి సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించగా.. రెండో సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ప్రియాంక గాంధీ జూన్ చివరి వారం లేదా, జులై మొదటి వారంలో తెలంగాణకు వస్తారు. ఈసారి మెదక్ లో భారీ బహిరంగ సభకు టీపీసీసీ ప్లాన్లు గీస్తోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ని తట్టుకుని నిలబడాలంటే కష్టమనే విషయం కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. కానీ ఇక్కడ బీజేపీని నిలువరించడం ఆ పార్టీకి అత్యవసరం. దక్షిణాదిలో బీజేపీ పాగా వేయకుండా చేసేందుకు కాంగ్రెస్ కష్టపడుతోంది. కర్నాటకలో సక్సెస్ అయింది, తెలంగాణలో కూడా అదే విధంగా పావులు కదుపుతోంది. గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఇటీవల ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ తర్వాత మహిళా డిక్లరేషన్.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా విడివిడిగా డిక్లరేషన్లు ప్రకటించాలని చూస్తున్నారు.

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు గాంధీ భవన్‌ లోని ప్రకాశం హాల్లో టీపీసీసీ విస్తృత సమావేశం జరగాల్సి ఉంది. రేపు రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జూన్-2న ప్రతి గ్రామంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతున్న నేపథ్యంలో ఎన్నికల సన్నాహక సమావేశంగా దీన్ని నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

First Published:  21 May 2023 1:52 AM GMT
Next Story