Telugu Global
Telangana

ఏడాది ఓపిక పట్టండి ప్లీజ్.. పార్టీ శ్రేణులకు రేవంత్ అభ్యర్థన..

ఈ దశలో పార్టీ మారడం వృథా అని, ఏడాది వేచి చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

ఏడాది ఓపిక పట్టండి ప్లీజ్.. పార్టీ శ్రేణులకు రేవంత్ అభ్యర్థన..
X

మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచినా, అది కేవలం మీటింగ్ ల వరకే పరిమితం అయ్యింది. టీఆర్ఎస్ అంతకు మించిన స్పీడ్ తో దూసుకెళ్తూ, కాంగ్రెస్ నుంచి వలస నాయకులకు రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో సహజంగానే కాంగ్రెస్ నుంచి వలసలు జోరందుకున్నాయి. ఈ దశలో పార్టీ మారడం వృథా అని, ఏడాది వేచి చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

మునుగోడులో కాంగ్రెస్ ర్యాలీ అగమ్యగోచరంగా మారింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత క్యాడర్ చెక్కుచెదరకూడదు అనే ఉద్దేశంతో మునుగోడులో కీలక నేతలంతా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. కానీ, అంతలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అసహనం, ఆయన అలక, ఆ తర్వాత క్షమాపణలు.. ఇలా ఈ ఎపిసోడ్ పక్కదారి పట్టింది. చివరకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినా వెంకట్ రెడ్డి తగ్గలేదు. దీంతో ర్యాలీలో కీలక నేతలెవరూ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. కరోనా వచ్చిందని రేవంత్ రెడ్డి కూడా మునుగోడు పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ పట్టు పెంచుకుంటోంది. దీంతో రేవంత్ రెడ్డి నష్టనివారణ చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా మునుగోడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఓ ప్రయోగశాలగా మార్చారని, మునుగోడులో సర్పంచ్‌, ఎంపీటీసీలను అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. కొవిడ్‌ కారణంగా ఇప్పటి వరకు మునుగోడు రాలేకపోయానని, ఈనెల 20 నుంచి మునుగోడులోనే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ పార్టీని వీడొద్దని, ఎనిమిదేళ్లు కొట్లాడిన నాయకులంతా, ఒక ఏడాది ఓపిక పడితే పార్టీని అధికారంలోకి తీసుకు రావొచ్చని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్‌ కాబోతోందన్నారు రేవంత్. ఇలాంటి సమయంలో పార్టీ మారి చరిత్ర హీనులుగా ఎవరూ మిగిలిపోవద్దని సూచించారు రేవంత్ రెడ్డి.

First Published:  16 Aug 2022 2:26 AM GMT
Next Story