Telugu Global
Telangana

చరిత్రలో బీజేపీ లేదు, ఆ సభలో జనం లేరు..

తెలంగాణ ఉద్యమం నేనే చేశానంటూ లగడపాటి రాజగోపాల్ అంటే ఎలా ఉంటుందో, సెప్టెంబర్ 17 పేరుతో అమిత్ షా సభ పెట్టినా అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.

చరిత్రలో బీజేపీ లేదు, ఆ సభలో జనం లేరు..
X

సెప్టెంబర్ 17 గొప్ప స్వాతంత్ర్య దినోత్సవం అని చరిత్ర లేని వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని బీజేపీ దొంగతనం చేసిందని అన్నారాయన. పటేల్ తో పాటు చరిత్రను కూడా బీజేపీ దొంగతనం చేయాలని చూస్తోందని విమర్శించారు. స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో బీజేపీ లేదని, చరిత్రలో బీజేపీ లేదు కాబట్టి, అమిత్ షా సభలో కూడా జనం లేరని సెటైర్లు వేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అమిత్ షా సభకు 1500 కూడా రాలేదని అన్నారు. 1980లో పుట్టిన బీజేపీ అయినా, 2001లో పుట్టిన టీఆర్‌ఎస్‌ అయినా కాంగ్రెస్ ని, కాంగ్రెస్ చేసిన త్యాగాలను పొగడక తప్పదని చెప్పారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ పోరాటంలో లగడపాటి, స్వాతంత్ర పోరాటంలో అమిత్ షా..

తెలంగాణ ఉద్యమం నేనే చేశానంటూ లగడపాటి రాజగోపాల్ అంటే ఎలా ఉంటుందో, సెప్టెంబర్ 17 పేరుతో అమిత్ షా సభ పెట్టినా అలాగే ఉంటుందని అన్నారు రేవంత్ రెడ్డి. అందుకే అమిత్‌ షా సభకు జనం రాలేదన్నారు. చరిత్రను వక్రీకరిస్తామంటే ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. భాగస్వామ్యం లేని పాత్ర పోషిస్తానంటే జనం ఊరుకోరని చెప్పారు.

అది టూరిజం శాఖ వేడుక..

పరేడ్ గ్రౌండ్ లో జరిగింది కేంద్ర ప్రభుత్వ అధికారిక వేడుక కాదని, కేవలం టూరిజం శాఖ వేడుక మాత్రమేనని అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. మునుగోడులో ఓట్లు అడగడానికి ఇదో ప్రయత్నం అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గుజరాత్ లో ఉన్న రాజు, హైదరాబాద్ నిజాం రాజు, జమ్మూ రాజు అంతా ఒకరే అని అన్నారు రేవంత్‌ రెడ్డి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత ఈ మూడు ప్రాంతాలకు స్వాతంత్రం లభించిందని గుర్తు చేశారు. మరి హైదరాబాద్ తో పాటు గుజరాత్ లోని జునేఘడ్ లో కూడా బీజేపీ ఎందుకు ఉత్సవాలు చేయడం లేదని నిలదీశారు రేవంత్ రెడ్డి. తెలంగాణకి వచ్చి ఎందుకు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. అసదుద్దీన్ ని బూచీగా చూపించి తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, ఇక్కడి సంస్థల్ని గుజరాత్ కి తరలించుకుపోవాలనే దురుద్దేశంతోనే బీజేపీ డ్రామాలాడుతోందని అన్నారు రేవంత్ రెడ్డి.

మునుగోడులో పాదాభివందనం..

అక్టోబర్ 2 నుంచి మునుగోడులో పాదాభివందనం కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. మునుగోడు ప్ర‌జ‌లంద‌రినీ కలుస్తామమని, కాళ్లు మొక్కి ప్రజాస్వామ్యం లో భాగస్వామ్యం అవ్వండని ప్రజల్ని వేడుకుంటామ‌న్నారు. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్‌ఎస్‌, బీజేపీ కి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు రేవంత్ రెడ్డి.

Next Story