Telugu Global
Telangana

బోడిగుండుపై జుట్టురాదు.. తెలంగాణలో బీజేపీ గెలవదు

గ్రౌండ్‌ లో కాంగ్రెస్ లేదని బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. భద్రాచలంలో కాంగ్రెస్ ప్రాబల్యం ఎంతుందో వచ్చి చూడండని ఛాలెంజ్ చేశారు.

బోడిగుండుపై జుట్టురాదు.. తెలంగాణలో బీజేపీ గెలవదు
X

బండి సంజయ్ బోడిగుండుపై జుట్టు వచ్చేది లేదని, తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గ్రౌండ్‌ లో కాంగ్రెస్ లేదని బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. భద్రాచలంలో కాంగ్రెస్ ప్రాబల్యం ఎంతుందో వచ్చి చూడండని ఛాలెంజ్ చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భద్రాచలాన్ని కుట్రపూరితంగా మూడు ముక్కలు చేశారని.. అలా చేసిన వారిని మూడు మీటర్ల లోతు గోతిలో పాతరేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు రేవంత్ రెడ్డి.

Advertisement

ఇందిరమ్మ ఇళ్లు ఉన్నచోటే ఓట్లు అడుగుతాం..

భద్రాచలం నియోజకవర్గంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి.. అధికార బీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట మాత్రమే తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న చోట ఓట్లు అడగబోమని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

గోదావరి వరద ముంపు బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు వద్ద నిర్మించే పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియడం లేదని రైతులు చెబుతున్నారని, ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Next Story