Telugu Global
Telangana

నమూనా బ్యాలెట్ పేపర్‌పై రేవంత్ రెడ్డి అభ్యంతరం

ఎన్నికల నిబంధనల ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ముందు ఉండాలని, ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఉండాలని రేవంత్ పేర్కొన్నారు.

నమూనా బ్యాలెట్ పేపర్‌పై రేవంత్ రెడ్డి అభ్యంతరం
X

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన నమూనా బ్యాలెట్‌పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసని రోజే అభ్యర్థులకు గుర్తులను కేటాయించిన ఈసీఐ.. తాజాగా నమూనా బ్యాలెట్ పేపర్ విడుదల చేసింది. పోలింగ్ రోజు ఈ బ్యాలెట్ పేపర్‌ను ఈవిఎం మెషన్‌కు అనుసంధానించే బ్యాలెట్ యూనిట్‌కు అతికిస్తారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి బుధవారం విడుదల చేసిన నమూనా బ్యాలెట్ పత్రంలో మొదటి పేరు బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి, రెండో పేరు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మూడో పేరు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పేర్లు ఉన్నాయి. ఈ కూర్పుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు అనుసరించి ఈసీఐ వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ముందు ఉండాలని, ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఉండాలని రేవంత్ పేర్కొన్నారు. దాని ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి పేరు నాలుగో స్థానంలో ఉండాలని.. జాతీయ పార్టీలైన బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ తొలి మూడు స్థానాల్లో ఉండాలని చెప్పారు. టీఆర్ఎస్ ఇంకా ఒక ప్రాంతీయ పార్టీయేనని.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు నాలుగో స్థానంలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్దంగా పాల్వాయి స్రవంతి పేరు నాలుగో స్థానానికి చేర్చిందని.. దీని వల్ల తమకు నష్టం కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే ఈసీఐ నిబంధనలు మరోసారి పరిశీలించి స్థానాలను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీఐ స్పందించలేదు. తమ అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే అప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది.

First Published:  20 Oct 2022 2:53 AM GMT
Next Story