Telugu Global
Telangana

టీడీపీకి వెన్నుపోటు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పాలకుర్తిలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేయాలనే కుట్ర జరుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

టీడీపీకి వెన్నుపోటు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబే టీడీపీని సగం చంపేశారు. 2014 ఎన్నికల్లో ఓటర్లు కాస్త మద్దతిచ్చినా, నాయకులు నిలబడలేదు. ఎక్కడివారక్కడ పక్క పార్టీల్లోకి సర్దుకున్నారు. చివరకు పేరుకే టీడీపీ అక్కడ మిగిలిపోయింది. టీడీపీనుంచి బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరి, ఏకంగా పీసీసీ పీఠం కైవసం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా రేవంత్ రెడ్డి తెలంగాణలో టీడీపీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ లాంటి నేతలు టీడీపీలో ఉండి, బీఆర్ఎస్ కి కోవర్టులుగా మారి సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై టీడీపీ లేకుండా చేసిన నాయకుల్లో ఎర్రబెల్లి ఒకరని చెప్పారు. ఎర్రబెల్లి పచ్చిమోసగాడని, రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని కోవర్ట్ ఆపరేషన్ చేసి నాశనం చేశాడన్నారు. అలాంటి ఆయన ఏదో ఒకరోజు కేసీఆర్ ని కూడా మోసం చేస్తారని చెప్పారు.

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి చేరుకున్న రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎర్రబెల్లి ఓనమాలు, ఏబీసీడీలు రాకుండానే మంత్రి అయ్యారని, ఆయన వాటిని పేపర్ పై రాస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పాలకుర్తి గడ్డపై సవాల్ చేసి చెబుతున్నానని అన్నారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ వస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్..

పాలకుర్తిలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేయాలనే కుట్ర జరుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పేదల ఇంటి నిర్మాణానికి ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలు ఇస్తామని మాటిచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము వెంటనే విడుదల చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో వైద్యఖర్చుల సాయాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని అన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ గెలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ తెచ్చిన వాళ్లకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, ఇచ్చినవారికి ఓ అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు రేవంత్ రెడ్డి.

First Published:  15 Feb 2023 11:40 PM GMT
Next Story