Telugu Global
Telangana

రూటు మార్చిన రేవంత్.. సీఎం పోస్టుపై ఆశలు వదులుకున్నట్టేనా?

కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. సీఎం పోస్టు విషయంపై వివాదం చెలరేగుతూనే ఉంటుంది. పలువురు నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతుంటారు.

రూటు మార్చిన రేవంత్.. సీఎం పోస్టుపై ఆశలు వదులుకున్నట్టేనా?
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు, అధిష్టానం కూడా భావించాయి. తొలుత కాస్త హడావుడి చేసిన రేవంత్ ఆ తర్వాత డీలా పడిపోయారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ దూసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు కూడా అందుకు ఓ కారణమని చెప్పకతప్పదు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇంకా టీడీపీ వాసనలు తొలగించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే రేవంత్ ఎక్కడికి వెళ్లినా ఆయన ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తారు. ఆయన మాట్లాడుతుంటే ఈలలు, గోలలతో రెచ్చిపోతారు. రేవంత్ సీఎం, రేవంత్ సీఎం అంటూ నినాదాలు చేస్తారు. అయితే రేవంతే సొంతంగా మనుషులను పెట్టుకొని వారితో అలా జిందాబాదులు కొట్టించుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ గతంలో ఆరోపించారు. ఇదిలా ఉంటే తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

'నాకు సీఎం కావాలన్న కోరిక ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చాలు' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకగా సీఎం పదవిపై తనకు ఆశలేదంటూ ఆయన ప్రకటించారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. సీఎం పోస్టు విషయంపై వివాదం చెలరేగుతూనే ఉంటుంది. పలువురు నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతుంటారు. ప్రస్తుతం రాజస్థాన్ లో ఇటువంటి పరిస్థితే ఉందన్న విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పోటీ నెలకొన్నది. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా..? లేదా..? అన్నది వేరే విషయం.. కానీ, ఒకవేళ వస్తే ఎవరు సీఎం కావాలి..? అన్న విషయంపై ఇప్పుడే చర్చలు జరుగుతున్నాయి. రేవంతే సీఎం అని ఆయన వర్గీయులు అంటుంటే.. కాదని సీనియర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలను పక్కకు పెట్టి అందరూ కలిసి పనిచేసేందుకు వీలుగా రేవంత్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

First Published:  5 Dec 2022 11:55 AM GMT
Next Story