Telugu Global
Telangana

కేసీఆర్ నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌ల్పించండి

విమలక్కపై పెట్టిన ఉపా కేసును ప్రభుత్వం వెంట‌నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను గద్దె దించి తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అని రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌ల్పించండి
X

కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు క‌లిసి బుధవారం హైదరాబాద్‌లోని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నివాసాలకు వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించిన జయశంకర్ సార్ వర్ధంతి అని, వారి స్ఫూర్తితో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిందని గుర్తుచేశారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేక‌మంది ఉద్యమంలో చేరారన్నారు. విద్యార్థులు ఉద్యమంలో చేరి ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. అందరి పోరాటంతో తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ప్రయోజనం చేకూరలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ప్రొఫెస‌ర్ హరగోపాల్, విమలక్క, ఉద్యమకారులపై ఉపా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. విమలక్కపై పెట్టిన ఉపా కేసును ప్రభుత్వం వెంట‌నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను గద్దె దించి తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అని రేవంత్ రెడ్డి అన్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ఆయన పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయారని, ధరణి కోసం రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికి కిలో బంగారం ఇచ్చినా గెలవలేడన్నారు.

First Published:  21 Jun 2023 12:48 PM GMT
Next Story