Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్‌లో గడ్డు పరిస్థితి.. నెమ్మదిగా జారుకుంటున్న కీలక నేతలు

బలమైన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వం వల్ల కాదని భావిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వల్ల ఎన్నికల్లో గెలవలేమని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో గడ్డు పరిస్థితి.. నెమ్మదిగా జారుకుంటున్న కీలక నేతలు
X

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకడుగు ముందు కేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి. కీలక నేతలంతా నెమ్మదిగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. వారిని ఆపడానికి టీపీసీసీ ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వాళ్లంతా.. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కోపంతోనే వెళ్లిపోతున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఒక జిల్లాను లేదా పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయగల నాయకులే.. కాంగ్రెస్‌ను వీడి తమ దారి తాము చూసుకుంటున్నారు.

కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి నేతలు పార్టీని వదిలేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో ఒకవైపు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కీలక నేతలు పార్టీని వీడిపోతుండటంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్నా.. ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేరు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితే మెరుగ్గా ఉందని అనుకోవచ్చు. కానీ బలమైన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వం వల్ల కాదని భావిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వల్ల ఎన్నికల్లో గెలవలేమని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి పోటీగా పాదయాత్ర మొదలు పెట్టారు. కానీ, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. కనీసం రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రలో కూడా పాల్గొనలేదు. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న ఆయన.. తాజాగా బీజేపీలోకి జంప్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఎదురు వెళ్లిన నాయకులకు టీపీసీసీలో ప్రాధాన్యత లభించకపోవడంతోనే వారంతా తమ దారి తాము చూసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

గతంలో తెలంగాణ కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరించడానికి అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించింది. రాహుల్ గాంధీ కూడా జోక్యం చేసుకొని.. వారితో ఢిల్లీలో భేటీ అయ్యారు. అప్పటికి కలిసిపోయినట్లు కనపడినా.. పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. గతంలో మాణిక్యం ఠాకూర్ ఇంచార్జిగా ఉన్నప్పుడు సీనియర్ నాయకులు అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. దీంతో మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రేను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అయినా సరే కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా వలసలు కూడా పెరిగాయి.

ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వలసలు ఉంటాయో అని అధిష్టానం కూడా ఆందోళన చెందుతోంది. పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతే.. కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులైనా ఉంటారా అని కంగారు పడుతోంది. వెంటనే ఈ వలసలకు అడ్డుకట్ట వేయాలని, అందుకోసం అసంతృప్తులతో మాట్లాడాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా ఇతర సీనియర్లకు మల్లిఖార్జున్ ఖర్గే ఆదేశాలు జారీ చేశారు. పార్టీలోని నేతలను కాపాడుకోకుండా.. మనం ఎన్నికలకు వెళ్లలేమని గట్టిగానే చెప్పినట్లు తెలుస్తున్నది.

First Published:  15 April 2023 4:24 AM GMT
Next Story