Telugu Global
Telangana

టెక్ జెన్స్, రైట్ సాఫ్ట్ వేర్, స్టోరబుల్.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

డిజిటల్‌ సొల్యూషన్స్‌, సప్లై చైన్‌ లో పేరొందిన ‘టెక్‌ జెన్స్‌’ సంస్థ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌ ని ఆ సంస్థ ప్రతినిధులు కలిశారు.

టెక్ జెన్స్, రైట్ సాఫ్ట్ వేర్, స్టోరబుల్.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
X

ఐటీ కంపెనీలు, ఫార్మా సంస్థలు, బ్యాంకింగ్ దిగ్గజాలు.. ఒకటేంటి, దాదాపు అన్ని రంగాల్లోని ప్రముఖ కంపెనీలు అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ని కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటన పూర్తి విజయవంతంగా కొనసాగుతోందనడానికి అక్కడ జరుగుతున్న ఒప్పందాలే నిదర్శనం.

డిజిటల్‌ సొల్యూషన్స్‌, సప్లై చైన్‌ లో పేరొందిన ‘టెక్‌ జెన్స్‌’ సంస్థ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌ ని ఆ సంస్థ ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. ప్రోడక్ట్‌ డెవలప్‌ మెంట్‌, డిజైన్‌ థింకింగ్‌ కోసం అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ను హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు .


‘రైట్‌’ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ ప్రతినిధి బృందం కేటీఆర్‌ తో సమావేశమైంది. హైదరాబాద్‌ లో తమ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వానించింది. హైదరాబాద్ లో రైట్ సాఫ్ట్ వేర్ సంస్థ 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్టు తెలిపింది. విద్యాసంస్థలను భాగస్వాములుగా చేసుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తామని చెప్పారు ప్రతినిధులు. వరంగల్ లో కూడా ఒక డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తెలంగాణలో ఇప్పటికే ‘గ్లోబల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌’ నెలకొల్పిన ‘స్టోరబుల్‌’ సంస్థ విస్తరణ ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌ తో చర్చించింది. సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ని కలిశారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌ లో 41,000 స్టోరేజ్‌ సేవలను స్టోరబుల్ సంస్థ అందిస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తో కలసి పనిచేసేందుకు స్టోరబుల్ ఆసక్తి చూపించింది. హైదరాబాద్ లో 100మంది సాఫ్ట్ వేర్ డెవలపర్లను నియమించుకుని, ఆ తర్వాత రీసెర్చ్ డెవలప్ మెంట్ రంగంలో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది.

వరుస భేటీలతో మంత్రి బిజీ బిజీ..

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వారంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సంస్థలు ఉన్నవారు, విస్తరణ ప్రణాళికలను మంత్రిని కలసి చర్చిస్తున్నారు.

First Published:  22 May 2023 5:52 AM GMT
Next Story