Telugu Global
Telangana

ఇప్పటి యువత ఎంతో ధీమాతో ఉంది : మంత్రి కేటీఆర్

యువతలోనే కాకుండా.. గవర్నెన్స్‌లో కూడా ఇన్నోవేషన్ రావాలి. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇప్పటి యువత ఎంతో ధీమాతో ఉంది : మంత్రి కేటీఆర్
X

ఇప్పటి యువతకు ధైర్యం ఎక్కువ.. వాళ్లు మంచి కాలేజీల్లో చదువుకుంటున్నారు.. ఎక్కడైనా ఉద్యోగం వస్తుందనే ధీమాతో ఉన్నారని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ జనరేషన్ పిల్లలు ఏదో ఒక స్టార్టప్ మొదలు పెట్టి.. ఏదో ఒక పనిలో నిమగ్నమవుతున్నారు. ఎక్కడో ఒక చోట జాబ్ తెచ్చుకొని మొదటి రెండు నెలల్లోనే కారో, ఇల్లో కొంటున్నారు. తరాలు మారే కొద్దీ వారి ఆలోచనల్లో మార్పు వస్తుందని చెప్పడానికే ఈ ఉదాహరణ చెబుతున్నానని కేటీఆర్ అన్నారు. వరంగల్‌లోని కిట్స్‌ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

యువతలోనే కాకుండా.. గవర్నెన్స్‌లో కూడా ఇన్నోవేషన్ రావాలి. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతీ ఒక్కరు త్రీ'ఐ' ఫార్ములాను పాటించాలని అన్నారు. త్రీఐ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇంక్లూజివ్ గ్రోత్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పటి యువతకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి. లేదంటే ప్రైవేటు జాబ్ అయినా కొట్టాలని ఉండేది. రిటైర్మెంట్ నాటికి ఇల్లు కట్టుకోవాలి. అంతకు ముందు పిల్లల వివాహలు చేయాలనేది లక్ష్యంగా ఉండేది. కానీ నేటి తరం పిల్లల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచంతో పోటీ పడే ధైర్యం వచ్చింది. ఎక్కడైనా ఉద్యోగం వస్తుందనే ధీమా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.

నేటి తరానికి ఎంతో స్కిల్ ఉన్నది. అందుకే అంత ఆత్మవిశ్వాసం వచ్చింది. దాంతోనే ఇళ్లు, కార్లు కొంటున్నారు. మన సమాజంలో మార్పు వచ్చింది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఇంకా మార్పు రాలేదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాలు ఇంకా మూస పద్దతుల్లోనే పోతున్నాయి. అప్పు చెయ్యొద్దు.. అప్పు చేసి పప్పుకూడు తినొద్దనే మాటలు మాట్లాడుతుంటారని కేటీఆర్ చెప్పారు. అప్పులు చేసేది మౌలిక వసతులు కల్పించడానికే తప్ప వేరే విషయం కోసం కాదు కదా అని మంత్రి ప్రశ్నించారు. విదేశాల్లో రోడ్లు, హైవేలు ఎలా అభివృద్ధి చెందాయి. మన దగ్గర ఎందుకు అలా జరగడం లేదని ఎంతో మంది విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత అనుమానం వ్యక్తం చేస్తుంటారు. ఇదంతా మన ఆలోచనా ధోరణిలోనే ఉంటుందని కేటీఆర్ అన్నారు.

ఇన్నోవేషన్ అనేది స్టార్టప్స్‌కు మాత్రమే కాదు.. గవర్నెన్స్‌లో కూడా రావాలని కేటీఆర్ అన్నారు. కేవలం హైదరాబాద్, బెంగళూరులోనే ఐటీ రంగం అభివృద్ధి చెందితే చాలదు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి ప్రాంతాల్లో కూడా ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. టాలెంట్ ఉంటే ఎక్కడి నుంచైనా పని చేయవచ్చని పేర్కొన్నారు.

జపాన్ దేశంలో 15 శాతమే నివాసయోగ్యమైన భూమి ఉంది. మిగతా అంతా రాళ్లు, గుట్టలే. ఆటంబాంబు దాడికి గురైన జపాన్‌లో ప్రకృతి వనరులు కూడా లేవు. తాగేందుకు నీళ్లు, పండించేందుకు భూములు కూడా లేవు. అయినా ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక శక్తిగా మారింది. అక్కడి జనాభా కేవలం 12 కోట్లు మాత్రమే. వాళ్లు అంతగా ఎదగడానికి తమ తెలివిని వాడారు. మరి మనం 120 కోట్లకు పైగా ఉన్నాం. మనం బుర్ర వాడితే ఎంత గొప్ప దేశంగా ఉండేవాళ్లమో తెలుసా అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యువత కోసం ఎన్నో అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. మీ ఆవిష్కరణలకు ఒక రూపం ఇవ్వడానికి టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, రిచ్ వంటి సంస్థలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.


First Published:  5 May 2023 2:23 PM GMT
Next Story