Telugu Global
Telangana

తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాల‌కు ల‌క్కీ డ్రా నేడే

దరఖాస్తులు అధికంగా వచ్చిన ఎక్సైజ్ జిల్లాల్లో లక్కీడ్రా నిర్వహణ రాత్రి వరకు కొనసాగే అవకాశముంద‌ని ఆబ్కారీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాల‌కు ల‌క్కీ డ్రా నేడే
X

తెలంగాణ రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాల కేటాయింపు కోసం సోమ‌వారం ల‌క్కీ డ్రా నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 2023-25 ఎక్సైజ్ పాల‌సీకి సంబంధించి రాష్ట్రంలో 2,620 దుకాణాలు కేటాయించ‌నున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.. ఆయా రెవెన్యూ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తుదారుల సమక్షంలో సోమ‌వారం ఉదయం 10.30 నుంచి దుకాణాల వారీగా డ్రా నిర్వహించ‌నున్నారు.

గ‌త మ‌ద్యం పాల‌సీతో పోల్చితే ఈ ఏడాది మ‌ద్యం దుకాణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు రావ‌డం గ‌మ‌నార్హం. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను ఏకంగా 1,31,490 దరఖాస్తులు వ‌చ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల్లోనే 42,596 దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రాంతంలో గత పాలసీలో 18,091 దరఖాస్తులే వ‌చ్చాయి. మ‌ద్యం దుకాణాల కోసం ఈసారి చివరి రెండు రోజుల్లోనే దరఖాస్తులు భారీగా వ‌చ్చాయి. చివరిరోజు శ్రావణ శుక్రవారం కాగా, ఆ ఒక్క‌రోజే ఏకంగా 50 వేలకు పైగా ద‌ర‌ఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తులు అధికంగా వచ్చిన ఎక్సైజ్ జిల్లాల్లో లక్కీడ్రా నిర్వహణ రాత్రి వరకు కొనసాగే అవకాశముంద‌ని ఆబ్కారీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ల‌క్కీ డ్రా నిర్వ‌హ‌ణ కోసం శంషాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎక్సైజ్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. డ్రాలో ఎంపికైన వ్యాపారులు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్ ఫీజులో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్సుదారులు డిసెంబర్ ఒక‌టో తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగించేందుకు అనుమతిస్తారు.

First Published:  21 Aug 2023 2:11 AM GMT
Next Story