Telugu Global
Telangana

నేడు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.. రాహుల్ అనర్హతపై స్పందించిన సీఎం కేసీఆర్

ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటు కాలం దాపురించిందని కేసీఆర్ అన్నారు. మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నదని సీఎం అన్నారు.

నేడు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.. రాహుల్ అనర్హతపై స్పందించిన సీఎం కేసీఆర్
X

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ చీకటి రోజని కేసీఆర్ అభివర్ణించారు. ఈ మేరకు శుక్రవారం సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని నరేంద్ర మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని కేసీఆర్ మండిపడ్డారు.

రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా.. అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమని కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటు కాలం దాపురించిందని కేసీఆర్ అన్నారు. మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నదని సీఎం అన్నారు.

ప్రతిపక్ష నాయకులను వేధించడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని కేసీఆర్ మండిపడ్డారు. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ తన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని కేసీఆర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలో ప్రచారం చేస్తూ.. దొంగల ఇంటి పేర్లన్నీ మోడీ అనే ఎందుకుంటాయో అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ మాజీ మంత్రి ఒకరు కోర్టులో కేసు వేశారు. దీనిపై నాలుగేళ్ల పాటు విచారణ చేపట్టిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అయితే దీనిపై పై కోర్టుకు వెళ్లడానికి గడువు కూడా ఇచ్చింది. రాహుల్ లాయర్లు అదే రోజు ఆయనకు బెయిల్ తీసుకొని వచ్చారు. అయితే లోక్‌సభ సెక్రటరీ మాత్రం సూరత్ కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.


First Published:  24 March 2023 12:18 PM GMT
Next Story