Telugu Global
Telangana

హైదరాబాద్ మెట్రో.. ఇది హైదరాబాదీల జీవితంలో భాగంగా మారి ఐదేళ్లు

ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టిన హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం దేశంలో రెండో పెద్ద నెట్‌వర్క్‌గా ఉన్నది.

హైదరాబాద్ మెట్రో.. ఇది హైదరాబాదీల జీవితంలో భాగంగా మారి ఐదేళ్లు
X

సిటీ బస్సుల కోసం వెయిట్ చేసి.. బస్సు రావడంతోనే తోసుకుంటూ ఎక్కి.. పొద్దున్నే స్నానం చేసినా.. ఆఫీస్, కాలేజీకి చేరిన తర్వాత చమట వాసనతో చేరిన రోజులు ఇప్పుడు లేవు. క్లయింట్‌తో అర్జెంట్ మీటింగ్ అంటే బైక్ మీద పోతూ ట్రాఫిక్‌లో ఇరుక్కొని వారికి సంజాయిషీ ఇచ్చుకునే రోజులు కూడా పోయాయి. నాగోల్ నుంచి రాయదుర్గం అయినా.. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ అయినా.. ఎంత సేపట్లో వస్తున్నామో.. కచ్చితంగా చెప్పెయ్యవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు తలుపులు ఎడమ వైపుకు తెరుచుకుంటున్నాయి.

ఇలాంటి అనౌన్స్‌మెంట్ హైదరాబాద్‌లో మొదలై నేటికి ఐదేళ్లు. హైదరాబాద్ నగరం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం 'మెట్రో రైల్'. దేశంలోని మెట్రో నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం అన్ని ప్రభుత్వాలు ఎన్నో రకాల ఏర్పాట్లు చేశాయి. సిటీ బస్సులు, లోకల్ రైళ్లు ఎన్ని ఉన్నా.. మెట్రో రైల్ కొన్ని నగరాల రూపు రేఖలను, జీవన శైలినే మార్చేసింది. 2000 మధ్యలో డెవలప్‌ అవుతున్న హైదరాబాద్‌లో అప్పటికి ఎంఎంటీఎస్, ఆర్టీసీ సిటీ సర్వీసెస్ తప్ప వేరే రవాణా సౌకర్యం లేదు. నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ హైదరాబాద్ మెట్రోకు అంకురార్పణ చేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చేసిన సర్వే, అంచనాలతో హైదరాబాద్ మెట్రో రూపుదిద్దుకున్నది.

పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్దతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. అయితే, కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ మందకొడిగా సాగుతూ వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మెట్రో ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన అనుమతులు అన్నీ మంజూరు చేస్తూనే.. కేంద్రం నుంచి రావల్సిన వయబుల్ గ్యాప్ ఫండ్‌ను కూడా అప్పట్లో రాబట్టారు. ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టిన హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం దేశంలో రెండో పెద్ద నెట్‌వర్క్‌గా ఉన్నది.

హైదరాబాద్ ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఎలివేటెడ్ (పై నుంచి వెళ్లేది) మెట్రోగా దీన్ని నిర్మించారు. మొత్తం మూడు లైన్లుగా దీని రూపకల్పన జరిగింది. నాగోల్ నుంచి హైటెక్‌సిటీ (తర్వాత రాయదుర్గం వరకు పొడిగించారు)- బ్లూ లైన్, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ - రెడ్ లైన్, జేబీఎస్ నుంచి ఫలక్‌నూమా (ఎంజీబీఎస్ వరకు మాత్రమే పూర్తయ్యింది)- గ్రీన్ లైన్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రెడ్ లైన్ 29 కిలోమీటర్లు, బ్లూ లైన్ 27 కిలోమీటర్లు, గ్రీన్ లైన్ 10 కిలోమీటర్లుగా ఉన్నది.

2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ అప్పటి గవర్నర్ నర్సింహ్మన్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో మెట్రోను ప్రారంభించారు. మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు మెట్రోలో కూడా ప్రయాణించారు. ఇక కమర్షియల్‌గా మెట్రో సేవలు మరుసటి రోజు (నవంబర్ 29) నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే అన్ని లైన్లు పూర్తి కాకపోవడంతో బ్లూలైన్ అమీర్ పేట నుంచి మియాపూర్ వరకు, రెడ్ లైన్ నాగోలు నుంచి అమీర్ పేట వరకు మాత్రమే మెట్రో సర్వీసులు నడిచాయి. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ లైన్ 2018 సెప్టెంబర్ 24న, నాగోల్ నుంచి రాయదుర్గం లైన్ 2019 నవంబర్ 29న పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇక జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ లైన్ 2020 ఫిబ్రవరి 7న ప్రారంభమైంది.

కోవిడ్ కారణంగా హైదరాబాద్ మెట్రోకు వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం మూడు లైన్లలో రైళ్లు పూర్తిగా నడుస్తున్నాయి. మెట్రో అధికారులు చెబుతున్న మేరకు ప్రస్తుతం బ్లూ, రెడ్ లైన్లలో రైళ్లు పూర్తి రద్దీగా నడుస్తున్నాయి. జేబీఎస్-ఎంజీబీఎస్ లైన్లో మాత్రం ఆదరణ కాస్త తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ లైన్ ఫలక్‌నూమ వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరింత ఆదరణ ఉంటుందని అధికారులు చెప్పారు.

హైదరాబాద్ మెట్రో ప్రారంభించిన తొలి ఏడాదిలో 3.2 కోట్ల మంది ప్రయాణించారు. ప్రస్తుతం మెట్రో రైల్ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం రోజుకు 3 లక్షల మంది (ఏడాదికి దాదాపు 10 కోట్లు) ప్రయాణిస్తున్నారు. అంటే నగర ప్రజలు మెట్రో ప్రయాణానికి ఎంత అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు.

మరింత విస్తరణ...

హైదరాబాద్ మెట్రోను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండో దశలో బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మేర రెండో దశను పూర్తి చేస్తామని ఇటీవలే మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందుకు దీనికి రూ. 8,453 కోట్లు ఖర్చు అవుతుందని, అవసరమైన నిధులు ఇవ్వాలని కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు.అయితే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. రెండో దశకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి వస్తే తప్ప పూర్తి చేసే అవకాశం లేదు.

కానీ, ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోను మాత్రం తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్ 9న మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు రూ. 6,250 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ లైన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇవన్నీ పూర్తి అయితే హైదరాబాద్ మెట్రో కూడా ఢిల్లీ మెట్రోతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోనే దేశంలో అతి పొడవైన రెండో మెట్రోగా రికార్డు సృష్టించింది.

మారిన జీవన శైలి.. పెరిగిన రియల్ ఎస్టేట్..

మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హైదరాబాద్ వాసుల జీవన శైలి మారిపోయింది. ఒకప్పడు ఆఫీసులకు వెళ్లాలంటే బస్సులు దొరికినా ట్రాఫిక్‌లో ఎంత టైం పడుతుందో అర్థం అయ్యేది కాదు. అలాగే బైక్ ఉన్నా.. ఆ రద్దీలో అలసి పోయే వాళ్లు. అందుకే ఆఫీసులకు దగ్గరగా ఉండే ఇళ్ల కోసం వెతుక్కునే వారు. ఇప్పుడు మాత్రం మెట్రో స్టేషన్ దగ్గర ఉంటే చాలు అనుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత శివారు ప్రాంతాలైన ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, చందానగర్, మియాపూర్‌లో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోయింది. అక్కడ అద్దెలు కూడా పెరగడం గమనార్హం.

First Published:  27 Nov 2022 11:45 PM GMT
Next Story