Telugu Global
Telangana

బ్లాక్ లో ఒక్క టిక్కట్టూ అమ్మలేదు -అజారుద్దీన్

హైదరాబాద్ లో జరగనున్న క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టిక్కట్ల అమ్మకాల్లో ఎలాంటి గందరగోళం జరగలేదని HCA అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. బ్లాక్ లో టిక్కట్లు అమ్మినట్టు కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బ్లాక్ లో ఒక్క టిక్కట్టూ అమ్మలేదు -అజారుద్దీన్
X

ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ 20 క్రికెట్ మ్యాచ్ టిక్కట్ల అమ్మకాల వ్యవ‌హారంలో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. టిక్కట్ల కోసం క్రికెట్ ప్రియులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో టిక్కట్లు బ్లాక్ లో అమ్ముకున్నారని HCA పై ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన HCA అధ్యక్షుడు అజారుద్దీన్, మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వెల్లడించారు. టిక్కట్లు విక్రయించే బాధ్యతను పూర్తిగా పేటీఎం కు అప్పగించామని, వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని తెలిపారు అజారుద్దీన్.

Advertisement

ఎక్కువ టిక్కట్ల ను ఆన్ లైన్ లోనే విక్రయించామని, ఆన్ లైన్ లో బ్లాక్ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై కావాలనే కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. భారీగా కాంప్లిమెంటరీ పాస్ లు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారాయన. జింఖాన మైదానంలో జరిగిన తొక్కిసలాట బాధాకరమని, అక్కడ గాయపడ్డవారందరికీ HCA స్వంత ఖర్చులతో చికిత్స చేయిస్తోందని ఆయన చెప్పారు.

HCA ఆర్థిక వ్యవహారాల్లో అనుమానాలుంటే తమ వెబ్ సైట్ చూడాలని అప్పటికీ అనుమానాలు తీరకపోతే తమను అడగాలని అజారుద్దీన్ అన్నారు. కాగా HCA లో విబేధాలు నిజమే అని HCA కార్యదర్శి విజయానంద్ చెప్పారు. టిక్కట్ల గందరగోళం గురించి తేల్చడానికి తాము ఓ కమిటీ వేస్తున్నామని ఆయన తెలిపారు.

Next Story