Telugu Global
Telangana

ఉమక్కకు మంచి హోదా ఇచ్చి గౌరవించుకుంటాం..

తుల ఉమక్కకు వేములవాడ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి బీజేపీ బీఫామ్ ఇవ్వకుండా గుంజుకోవడం బాధాకరం అన్నారు మంత్రి కేటీఆర్. మహిళల పట్ల, బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి ఇది నిదర్శనం అన్నారు.

ఉమక్కకు మంచి హోదా ఇచ్చి గౌరవించుకుంటాం..
X

బీజేపీకి రాజీనామా చేసి సొంత గూటికి చేరుకున్నారు తుల ఉమ. ఆమెకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఉమక్కకు గతంలో ఉన్న హోదా కంటే మరింత సమున్నత హోదాను, బాధ్యతలను అప్పగించి పార్టీ గౌరవించుకుంటుందని చెప్పారాయన. సీఎం కేసీఆర్ సూచన మేరకు స్వయంగా తానే ఉమక్కకు ఫోన్ చేసి ఆహ్వానించానని చెప్పారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఉమక్క బీఆర్ఎస్ లో చేరారని సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్.

బీసీ, మహిళా వ్యతిరేకి బీజేపీ..

తుల ఉమక్కకు వేములవాడ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి బీజేపీ బీఫామ్ ఇవ్వకుండా గుంజుకోవడం బాధాకరం అన్నారు మంత్రి కేటీఆర్. మహిళల పట్ల, బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి ఇది నిదర్శనం అన్నారు. తుల ఉమను బీజేపీ అవమానించడం బాధాకరం అని చెప్పారు. తెలంగాణ ఆడ బిడ్డగా, బీఆర్‌ఎస్‌ ఇంటిబిడ్డగా తన సేవలందించిన తుల ఉమక్కను బీజేపీ అవమానించిందన్నారు కేటీఆర్.

బీఆర్ఎస్ లోకి ఇద్దరు మహిళా నేతలు..

మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ కు రాజీనామా చేసి పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు. ఒకరోజు వ్యవధిలోనే వేములవాడ నియోజకవర్గం నుంచి తుల ఉమ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు. టికెట్ ఆశించి భంగపడి బీఆర్ఎస్ లో చేరారు. పాల్వాయి స్రవంతి రాజీనామాతో మునుగోడులో కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. తుల ఉమ రాకతో ఇటు వేములవాడలో బీజేపీ బలహీనపడి బీఆర్ఎస్ బలం పెరుగుతుంది. వేములవాడలో నామినేషన్ వేసిన తుల ఉమ.. బీఆర్ఎస్ లో చేరడంతో దాన్ని ఉపసంహరించుకుంటారని తెలుస్తోంది.

First Published:  13 Nov 2023 10:21 AM GMT
Next Story