Telugu Global
Telangana

ధరణి ద్వారా ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని.. రైతులకు ఇచ్చాము : సీఎం కేసీఆర్

తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఈ జిల్లాకే చెందిన ఒక ప్రబుద్దుడు మాట్లాడుతున్నాడు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే.. తెలంగాణ రైతులను వేసినట్లే అని కేసీఆర్ అన్నారు.

ధరణి ద్వారా ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని.. రైతులకు ఇచ్చాము : సీఎం కేసీఆర్
X

ఒకప్పుడు భూముల అమ్మకాలు, కొనుగోలు అంటే అంతా లంచాలమయంగా ఉండేది. కానీ ధరణితో అధికారుల వద్ద ఉన్న అధికారాన్ని రైతులకు, ప్రజలకు ఇచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రెవెన్యూ రికార్డులు మార్చే అధికారం సీఎంనైన నాకు కూడా లేదని.. ధరణి రాకతో పైరవీలు, లంచాలకు అడ్డుకట్ట పడిందని సీఎం చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించిన కేసీఆర్ ప్రసంగించారు.

తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఈ జిల్లాకే చెందిన ఒక ప్రబుద్దుడు మాట్లాడుతున్నాడు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే.. తెలంగాణ రైతులను వేసినట్లే అని కేసీఆర్ అన్నారు. ధరణి వల్ల 99 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు. ధరణి వల్ల ఒక శాతం సమస్యలు ఉండవచ్చు.. కానీ ఇవ్వాళ రైతు బంధు డబ్బులు పడితే.. రైతుల ఫోనులు టింగ్ టింగ్ మని మోగుతున్నాయి. దీనికి ధరణే కారణమని కేసీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ రాజ్యంలో దళారీలతో భోజ్యం. కాంగ్రెస్ సర్కార్‌కు, బీఆర్ఎస్ సర్కార్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ధరణి లేకపోతే ఎన్నో గొడవలు, గట్టు పంచాయితీలు, హత్యలు జరిగేవి. మళ్లీ రైతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతు బంధు, రైతు బీమా ఇవ్వాలని ఏ కాంగ్రెస్ పార్టీనో, తెలుగుదేశం పార్టీనో అమలు చేయలేదు. రైతు బంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని కేసీఆర్ చెప్పారు.

రైతు చనిపోతే ఆపద్భందు కింద రూ.50వేలు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పేవాళ్లు. కానీ ధరణి కారణంగా.. ఈ రోజు దరఖాస్తు పెట్టకుండానే.. లంచం ఇవ్వకుండానే.. చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఖాతాలో జమ అవుతున్నాయని సీఎం చెప్పారు. ధరణి లేకపోతే రైతులకు పైసలు రావు. ఈ రోజు మీరు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంన్నదంటే దానికి ధరణిలో ఉన్న వివరాలే కారణం అని కేసీఆర్ చెప్పారు.

రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. ఏ రాష్ట్రంలో కూడా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడం లేదు. ఇలాంటి సమయంలో మళ్లా ఎవరెవరో వచ్చి రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. మన అవ్వా, తాతలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, కళ్లద్దాలు పంపిణీ చేస్తారని ఎవరైనా ఊహించారా? కానీ అలాంటి ముసలి వారికి ఉచితంగా కంటి పరీక్షలు, చికిత్సలు తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు.

ఈ నెల 9 నుంచి కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి రూ.1 లక్ష సాయం అందిస్తున్నాము. అర్హులైన వారందరూ వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. గృహ‌ల‌క్ష్మి కింద నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాం. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా ఉండి తెలంగాణ సాధించాను కాబ‌ట్టి.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు 4 వేల ఇండ్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒకనాడు పాలమూరు జిల్లా కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. ఒకప్పుడు గంజి కేంద్రాలు ఉండేవి. కానీ ఇప్పుడు గంజి కేంద్రాలు మాయమై.. పంట కొనుగోలు కేంద్రాలు వచ్చాయని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఏనాడైనా నాగర్ కర్నూల్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని ఊహించారా అని అన్నారు.

తెలంగాణ మోడల్ మాకు కావాలని దేశమంతా కోరుకుంటోంది. తనను జాతీయ రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తున్నారు. మరి నేను పోవాలా? మీరు వెళ్లమని ఆశీర్వదిస్తే తప్పకుండా వెళ్తానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలే నా బంధువులు.. బలగం.. మీరు ఇచ్చే ధైర్యంతోనే ముందుకు పోతున్నానని అన్నారు.

First Published:  6 Jun 2023 3:10 PM GMT
Next Story