Telugu Global
Telangana

పెళ్లయిన వారానికే తీరని విషాదం.. - రోడ్డు ప్రమాదంలో నవ వరుడు సహా ముగ్గురు మృతి

అన్నసాగర్‌ వద్దకు రాగానే వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి.. అదే వేగంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టుకుంది.

పెళ్లయిన వారానికే తీరని విషాదం.. - రోడ్డు ప్రమాదంలో నవ వరుడు సహా ముగ్గురు మృతి
X

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు సహా ముగ్గురు మృతి విషాద ఘటన ఇది. ఈ ప్రమాదంలో నవ వరుడితో పాటు వధువు తండ్రి, కారు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. వధువు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. మహబూబ్‌ నగర్‌ జిల్లా భూత్పూరు మండలం అన్నసాగర్‌ వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అనంతపురానికి చెందిన వెంకటరమణ (55) నంద్యాల జిల్లా రాచర్ల ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన ఏకైక కుమార్తె అనూషకు హైదరాబాద్‌లోని మణికొండలో స్థిరపడిన కృష్ణా జిల్లాకు చెందిన పవన్‌ సాయికుమార్‌తో ఈ నెల 15న అనంతపురంలో వివాహం చేశారు. హైదరాబాద్‌లోని పెళ్లి కుమారుడి ఇంట్లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్న వధువు బంధువులు బుధవారం సాయంత్రం రెండు కార్లలో అనంతపురానికి బయలుదేరారు.

అన్నసాగర్‌ వద్దకు రాగానే వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి.. అదే వేగంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టుకుంది. ఈ కారులో ప్రయాణిస్తున్న వధువు తండ్రి వెంకటరమణ (55), నవ వరుడు పవన్‌ సాయి కుమార్‌ (25), డ్రైవరు చంద్ర (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే కారులో ప్రయాణిస్తున్న నవ వధువు అనూష తీవ్ర గాయాలపాలైంది. ఆమెను వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మహబూబ్‌ నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూరు సీఐ రామకృష్ణ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  22 Feb 2024 7:51 AM GMT
Next Story