Telugu Global
Telangana

సబ్సిడీ సిలిండర్లను ఆ పేదలు కొనడం లేదు.. ఎందుకో తెలుసా?

నిరుడు పీఎంయూవై లబ్ధిదారులు 1.18 కోట్ల మంది ఒక్క సిలిండర్ కూడా కొనుగోలు చేయలేదు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల్లో ప్రతీ తొమ్మిది మందిలో ఒకరు సిలిండర్ అసలు కొనలేదు.

సబ్సిడీ సిలిండర్లను ఆ పేదలు కొనడం లేదు.. ఎందుకో తెలుసా?
X

గ్రామీణులు, వెనుకబడిన కుటుంబాలకు చెందిన వాళ్లు ఎల్పీజీని ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) పేరుతో సబ్సిడీ సిలిండర్లను అందిస్తున్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా.. సాధారణ సబ్సిడీ సిలండర్ల కంటే రూ.200 తక్కువగా వీటిని సరఫరా చేస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇలాంటి సిలిండర్లను పేదలు కొనడం లేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మంది పేదలు పీఎంయూవై సిలిండర్లను అసలు కొనకపోవడమో, లేదంటే ఒక్క సిలిండర్‌తో సరిపెట్టుకోవడమో చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2018 నుంచి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడమే ఇందుకు కారణం అని తెలుస్తున్నది. ఎల్పీజీ భారాన్ని పేదలు తట్టుకోలేక సిలిండర్లను పక్కన పెట్టి, మళ్లీ కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో పీఎంయూవై సిలిండర్ ధర రూ.903కు చేరింది. తాజాగా రూ.200 అందరికీ తగ్గించడంతో రూ.703గా ఉన్నది. ఇంత తగ్గించినా పేదలు మాత్రం సిలిండర్ల రీఫిల్లింగ్ వైపు మొగ్గు చూపడం లేదు.

నిరుడు పీఎంయూవై లబ్ధిదారులు 1.18 కోట్ల మంది ఒక్క సిలిండర్ కూడా కొనుగోలు చేయలేదు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల్లో ప్రతీ తొమ్మిది మందిలో ఒకరు సిలిండర్ అసలు కొనలేదు. ఇక 1.51 కోట్ల మంది కేవలం ఒకే సిలిండర్ కొని సరిపెట్టుకున్నారు. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థలను ఆర్టీఐ ద్వారా కోరగా ఈ వివరాలు వెల్లడించాయి.

2018 జనవరి నుంచి 2023 మార్చ్ మధ్య కాలంలో ఎల్పీజీ సిలిండర్ ధర 82 శాతం మేర పెరిగింది. 2018 జనవరిలో పీఎంయూవై లబ్దిదారులు రూ.495.64కు సిలిండర్ లభించేది. కానీ ఇప్పుడు అదే సిలిండర్ 2023 మార్చిలో రూ.903కు దొరుకుతోంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంతో ప్రస్తుతం రూ.703కు లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇక నాన్-సబ్సిడీ డొమెస్టిక్ సిలిండర్ 2018 మార్చిలో రూ.741 ఉండగా.. మార్చి 2023 నాటికి 49 శాతం మేర ధర పెరిగి రూ.1,103కు చేరింది. ఇటీవల ఈ సిలిండర్ కొనుగోలు చేసే వారికి కూడా రూ.200 తగ్గించడంతో ఇప్పుడు రూ.903కు లభిస్తోంది.

రీఫిల్లింగ్ తక్కువే..

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఆర్టీఐ ద్వారా తెలియజేసిన వివరాల ప్రకారం.. పీఎంయూవై లబ్ధిదారులు 2022-23లో సగటున ఏడాదికి 4 కంటే తక్కువ సిలండర్లే వాడుతున్నారు. ఐవోసీఎల్ సిలిండర్లు సగటున 3.53, హెచ్‌పీసీఎల్ సిలిండర్లు 3.72, బీపీసీఎల్ సిలిండర్లు సగటున 4.02 తీసుకున్నారు. ఇదే సమయంలో నాన్ పీఎంయూవై సిలిండర్ల రీఫిల్లింగ్ సగటున ఏడాదికి 6.67 సిలిండర్లుగా ఉండటం గమనార్హం.

నాన్ పీఎంయూవై లబ్ధిదారుల్లో ఎంపిక చేసిన వారికి కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. దీని కోసం నిరుడు రూ.2,454.81 కోట్లు ఖర్చు అయినట్లు ఆయల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే సబ్సిడీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వివరించాయి. అంతర్జాతీయ ఎల్పీజీ ధరల మేరకే సిలిండర్ల ధరల్లో మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.

అంతర్జాతీయంగా ధరలు తగ్గినా...

దేశంలోని ఎల్పీజీ సిలిండర్ల ధరలను 70 శాతం వరకు అంతర్జాతీయ ఫ్రీ ఆన్ బోర్డు రేటు ప్రకారమే నిర్ణయిస్తున్నట్లు తెలుస్తున్నది. సౌదీ అరామ్‌కో కాంట్రాక్ట్ ధర ప్రకారం బ్యూటేన్ (60 శాతం), ప్రొపేన్ (40 శాతం) కలిపి దేశీయ కంపెనీలకు ఎల్పీజీ లభిస్తుంది. దీనికి అదనంగా దిగుమతి సుంకాలు, బాట్లింగ్ చార్జీలు, రవాణా, డెలివరీ చార్జీలు, జీఎస్టీ, డిస్ట్రిబ్యూటర్ కమిషన్ కలిపి అంతిమంగా కస్టమర్ రేటు నిర్ణయిస్తారు.

అయితే అంతర్జాతీయంగా జనవరి 2019లో ఎల్పీజీ ధర మెట్రిక్ టన్నుకు 600 డాలర్లు ఉన్నది. అయితే ఈ ఏడాది మార్చిలో దాని ధర 385 డాలర్లకు తగ్గింది. అయినా సరే ఎల్పీజీ ధరలు మాత్రం తగ్గలేదు. పైగా ఈ మధ్య కాలంలో సిలిండర్ ధర రెండు సార్లు పెంచారు. కాగా, తాజాగా రూ.200 తగ్గించినా.. అంతర్జాతీయ ధరల ప్రకారం చూస్తే.. దీన్ని మరింతగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

First Published:  5 Sep 2023 5:52 AM GMT
Next Story