Telugu Global
Telangana

ఎంపీ అరవింద్ తెచ్చిన పసుపు బోర్డు ఇదే.. నిజామాబాద్ జిల్లాలో వినూత్న నిరసనలు

నిజామాబాద్ జిల్లా అంతటా ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ వినూత్న నిరసనలు తెలియజేస్తున్నారు. పసుపు రంగు బోర్డులు ఏర్పాటు చేసి.. దానిపై ఇదే మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ రాశారు.

ఎంపీ అరవింద్ తెచ్చిన పసుపు బోర్డు ఇదే.. నిజామాబాద్ జిల్లాలో వినూత్న నిరసనలు
X

తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు సహా ఇతర ప్రాజెక్టులు ఏవీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. కేవలం మాటలు చెప్పడమే కాకుండా.. ఏకంగా బాండ్ పేపర్ మీద రాసి, సంతకం పెట్టారు. ఇప్పటికి ఆయన ఎంపీ అయ్యి నాలుగేళ్లు అయినా.. పసుపు బోర్డు అతీగతీ లేదు. తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్.. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏమీ లేదని పార్లమెంటులో ప్రకటించారు. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు కన్నెర్ర చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా అంతటా ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ వినూత్న నిరసనలు తెలియజేస్తున్నారు. పసుపు రంగు బోర్డులు ఏర్పాటు చేసి.. దానిపై ఇదే మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ రాశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలను ప్రజలు ఆసక్తిగా చూస్తుండటమే కాకండా.. ఎంపీ అరవింద్ కల్లబొల్లి మాటలపై చర్చ జరుగుతోంది. నెల రోజుల్లో పసుపు బోర్డు అంటూ బాండ్ పేపర్ రాసి.. ఇప్పటి వరకు దానిపై కనీస స్పందన లేదని ఎంపీ అరవింద్‌పై రైతులు మండిపడుతున్నారు. కేంద్రం ఏకంగా అలాంటి బోర్డు ఏదీ ఏర్పాటు చేయడం లేదని ప్రకటించిన తర్వాత కూడా.. అరవింద్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ గెలిస్తే వెంటనే పసుపు బోర్డు తెస్తానని చెప్పారు. నాలుగేళ్లు గడిచినా ఆ ఊసులేదు. ఇకనైనా వస్తుందని అనుకుంటే.. ఇప్పుడు కేంద్రమే స్వయంగా పసుపు బోర్డు ప్రతిపాదన లేదని ప్రకటించింది. ఇక ఇప్పుడు ఏం సాకులు చెప్తారంటూ అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కును కోల్పోయారని వ్యాఖ్యానిస్తున్నారు. మళ్లీ ఓట్ల కోసం ఎంపీ అరవింద్ వస్తే తప్పక ప్రశ్నిస్తామని.. ఆయనకు ఎలా బుద్ది చెప్పాలో తమకు తెలుసని రైతులు, ప్రజలు అంటున్నారు.





First Published:  31 March 2023 4:44 AM GMT
Next Story