Telugu Global
Telangana

తెలంగాణకి ఆంధ్ర పార్టీలు క్యూ వెనక క్లూ ఇదే..

ఎటువంటి ప్రజామోదంలేని షర్మిల వెనక ఎవరున్నారో మొన్నటికీ మొన్న ఆమె ట్రాఫిక్ న్యూసెన్స్ సందర్భంగా తేలిపోయింది. ఇక్కడ ప్రజల మద్దతు చూసి కాదు, ఢిల్లీలో ప్రభుత్వ పెద్దల అండతో వైఎస్సార్‌టీపీ నడుస్తోందని తేలిపోయింది.

తెలంగాణకి ఆంధ్ర పార్టీలు క్యూ వెనక క్లూ ఇదే..
X

తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చే ఎన్నికల్లోనూ ఎదురులేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. టీఆర్ఎస్ రాజకీయ లక్ష్యాల పరిధిని విస్తరించాలనుకుంది. దీని ఫలితమే భారత రాష్ట్ర సమితి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. బీజేపీ మత తత్వ పార్టీగా ముద్రపడింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో కేసీఆర్ ప్రజాబలం ముందు నిలవలేకపోతున్నాయి. ఇదే సమయంలో ఎంఐఎం, కమ్యూనిస్టులు బీఆర్ఎస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ కారు జోరు ఖాయం. ఇటువంటి స్పష్టమైన రాజకీయ ముఖచిత్రం కనిపిస్తున్నా.. ఆంధ్రప్రాంత పార్టీల నేతలు ఒక్కొక్కరుగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తామూ ఉన్నామంటూ రంగప్రవేశం చేస్తున్నారు.

లోటస్ పాండ్‌లో ఇల్లు ఉండటం తప్పించి, తెలంగాణ రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని షర్మిల తాను తెలంగాణ కోడలినంటూ కొన్ని రోజులుగా గొంతు చించుకుంటోంది. ఎటువంటి ప్రజామోదంలేని షర్మిల వెనక ఎవరున్నారో మొన్నటికీ మొన్న ఆమె ట్రాఫిక్ న్యూసెన్స్ సందర్భంగా తేలిపోయింది. ఇక్కడ ప్రజల మద్దతు చూసి కాదు, ఢిల్లీలో ప్రభుత్వ పెద్దల అండతో వైఎస్సార్‌టీపీ నడుస్తోందని తేలిపోయింది. ఆంధ్రకు చెందిన ప్రజాశాంతి అధినేత కేఏ పాల్.. ఏపీ ఎన్నికల్లో పోటీచేసి నవ్వులపాలయ్యాడు. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాని కలిసి వచ్చిన తరువాత మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కేఏ పాల్ హడావిడి తెలుగు ప్రజలంతా చూశారు.

విశాఖ వచ్చిన ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆ భేటీ వివరాలు బయటకు రాకపోయినా, తెలంగాణలో ఎటువంటి పార్టీ నిర్మాణంలేని జనసేన 32 నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జులను నియమించింది. ఏపీ ఎన్నికల్లో ఒక్క సీటు తెచ్చుకుని, తాను రెండుచోట్లా ఓడిపోయిన పవన్, తెలంగాణలో 32 స్థానాలకు పోటీచేస్తామని ప్రకటించడం వెనక బీజేపీ స్కెచ్ ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నామమాత్రమైపోయింది. అయితే సడెన్ గా పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకంతో టిడిపి కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు పావులు కదుపుతోందని తేటతెల్లం అవుతోంది.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన వీరందరి లక్ష్యం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ని గద్దె దించడమేనని జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్ర ప్రాంత రాజకీయ పార్టీల అధినేతలు షర్మిల, కేఏ పాల్, పవన్, చంద్రబాబులు తమ అభ్యర్థులను తెలంగాణలో నిలిపి టీఆర్ఎస్ ఓటుబ్యాంకుకి గండికొట్టాలనేది కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహం అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

First Published:  16 Dec 2022 3:15 PM GMT
Next Story