Telugu Global
Telangana

కమ్యూనిస్టులతో పొత్తు వద్దనడం వెనుక కేసీఆర్ వ్యూహం ఇదే..!

ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు షాకిస్తూ ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కేవలం నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు.

కమ్యూనిస్టులతో పొత్తు వద్దనడం వెనుక కేసీఆర్ వ్యూహం ఇదే..!
X

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కమ్యూనిస్టులకు షాక్ ఇచ్చారు. పొత్తులపై కామ్రేడ్‌లు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. మునుగోడు బైపోల్ టైంలో కమ్యూనిస్టుల మద్దతు తీసుకున్నారు కేసీఆర్. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, కేసీఆర్ మాత్రం ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు షాకిస్తూ ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కేవలం నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. ఆ నాలుగు స్థానాలు కూడా కమ్యూనిస్టులు కోరిన స్థానాల జాబితాలో లేవు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తు లేదనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పేశారు కేసీఆర్‌.

మునుగోడు ఉపఎన్నిక టైంలో బీఆర్ఎస్‌కు సీపీఐ, సీపీఎం మద్దతిచ్చాయి. ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటంతో ఆ రెండు పార్టీల నేతలను ప్రగతిభవన్‌కు పిలిచి చర్చలు జరిపారు కేసీఆర్‌. ఆ పార్టీల జాతీయ నేతలు సైతం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాల్లోనూ కలిసి ప‌నిచేయాలని నిర్ణయించారు. కమ్యూనిస్టుల మద్దతుతో మునుగోడు ఉపఎన్నికలో దాదాపు పది వేల ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై విజయం సాధించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తమకు చెరో 5 స్థానాలు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ మాత్రం నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చెరో సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. అయితే ఈ అంశంపై చర్చలు జరిపేందుకు నెల క్రితమే కమ్యూనిస్టులు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరగా..ఆయన స్పందించలేదని తెలుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు కన్నా..వారు వేరుగా పోటీ చేయడమే తమకు కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట. వైఎస్సార్టీపీ, ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని బీఎస్పీతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల వ్యతిరేక ఓటు చీలి బీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందనేది కేసీఆర్‌ వ్యూహంగా తెలుస్తోంది.

ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాండివ్వడంతో ఇప్పుడు కమ్యూనిస్టుల దారి ఏటనేది ఆసక్తిగా మారింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగంగా ఉన్నాయి. దీంతో తెలంగాణలోనూ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో వెళ్తారా.. లేదా ఒంటరిగానే బరిలో దిగుతారా.. అనేది తేలాల్సి ఉంది.

First Published:  21 Aug 2023 2:49 PM GMT
Next Story