Telugu Global
Telangana

టీఆర్ఎస్ తో పొత్తు ఉండదు, తెలంగాణలో బీజేపీ రాదు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీ తరపున కనీసం 10 మంది కూడా గెలవలేరని చెప్పారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కి పొత్తు ఉండదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

టీఆర్ఎస్ తో పొత్తు ఉండదు, తెలంగాణలో బీజేపీ రాదు
X

తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్‌తో కలయిక కలలో కూడా జరగదని స్పష్టం చేశారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై.. ఈ ఇంటి కాకి ఆ ఇంటిపై వాలదని అన్నారు. ఒకవేళ వాలితే చంపేస్తామని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని వరంగల్ సభలోనే రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. పొలిటికల్ సీన్‌ లో కాంగ్రెస్‌ ను లేకుండా చేసేందుకు గతంలో టీఆర్ఎస్ వ్యూహం రచించిందని, ఇప్పుడు బీజేపీతో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కుంటోందని అన్నారు. బీజేపీ తమకి ఉమ్మడి శత్రువైనా, తమ మధ్య స్నేహం లేదని, రాబోదని చెప్పారు రేవంత్ రెడ్డి.

10సీట్లు వస్తాయా..?

తెలంగాణలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందనే సవాళ్లపై ఘాటుగా స్పందించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు నాయకులే లేరని, అందుకే ఇతర పార్టీలనుంచి వచ్చినవారితో రాజీనామాలు చేయించి పోటీకి దింపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులే లేరని, ఒకవేళ అన్ని స్థానాల్లో పోటీ చేసినా, 10సీట్లు కూడా బీజేపీకి రావని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

దేశంలో ఎక్కడా లేనట్టుగా..

కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి, ఆయనతో కలసి కాసేపు యాత్రలో పాల్గొన్నారు. కర్నాటక, రాయచూర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశిస్తుందని, అక్టోబర్ మూడో వారంలో రాహుల్ తెలంగాణలో అడుగు పెడతారని చెప్పారు రేవంత్ రెడ్డి. దేశంలో ఎవరూ ఆహ్వానించనట్టుగా.. రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ స్వాగతం పలుకుతుందని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో పార్టీ ఇమేజ్ పెరుగుతుందని, ఇటు తెలంగాణలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు.

First Published:  8 Sep 2022 11:45 AM GMT
Next Story