Telugu Global
Telangana

పంప్ హౌస్ లు నీటమునిగినా కాళేశ్వరానికి నష్టం లేదు..

పంప్ హౌస్ లు నీటమునిగినా కాళేశ్వరానికి నష్టం లేదు..
X

గోదావరి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-1 లోని లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్ హౌస్ లు పూర్తిగా నీటమునిగాయి. పంప్ హౌస్‌ల‌లోకి వరదనీరు చేరింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. కేసీఆర్ వైఫల్యం వల్లే పంప్ హౌస్ లు నీటమునిగాయన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని ఇప్పుడు నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. పంప్ హౌస్ లు నదుల పక్కనే కడతారని, వరదలకు అవి నీట మునగడం సహజమేనని, ఆ విషయం తెలియక బండి నోరు పారేసుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు దుయ్యబడుతున్నారు. బండి విమర్శలను పక్కనపెడితే పంప్ హౌస్ లు నీట మునగడం వాస్తవం, వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే కచ్చితంగా మరమ్మతులు చేయాలి, మరి ఆ డబ్బు ఎవరిస్తారు..? పంప్ హౌస్ లు నీట మునగడం వల్ల ప్రజలపై భారం పడుతుందా, ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందా..? ఈ అనుమానాలన్నిటికీ సమాధానమేంటో మీరే చూడండి.

కాలం వృథా తప్ప ఆర్థిక నష్టం లేదు..

పంప్ హౌస్‌ల‌లోకి వ‌ర‌ద‌నీరు చేరడం వల్ల ఆ నీరంతా బయటకు వెళ్లే వరకు ప్రాజెక్ట్ పనిచేయదు. ఈ స్థాయిలో వరదలు వచ్చాయి కాబట్టి, మరికొన్నాళ్లు ఎత్తిపోతల పథకాలతో పెద్దగా అవసరం ఉండదు. అయితే పంప్ హౌస్ ల నుంచి వరదనీరు బయటకు తోడేందుకు, బురదను ఎత్తిపోసేందుకు కొంత సమయం పడుతుంది. వరద తగ్గాక మోటర్లల్లో, పంపుల్లో చేరిన నీటిని బయటకు తోడివేస్తారు. అందులో చేరిన బురద, ఇసుక, మట్టి పూర్తిగా తీసివేస్తారు. తర్వాత ఆయా మెషీన్లకు సర్వీసింగ్ చేసి తిరిగి వాటి స్థానాల్లో అమర్చుతారు. మెయింటెనెన్స్ పూర్తయిన తరువాత అవసరాన్ని బట్టి మెషీన్లను ఉపయోగిస్తారు.

ఖర్చు ఎవరిది..?

పంపు హౌస్ లు నీట మునగడం వల్ల ప్రభుత్వానికి, ప్రజాధనానికి ఎటువంటి నష్టం ఉండదు. పంప్ హౌస్ లోని మోటర్లు, ఇతర సామగ్రి సప్ల‌య్ చేసిన బీహెచ్ఈఎల్, జైలం, ఆండ్రిడ్జ్ వంటి కంపెనీలే వాటి నిర్వహణ బాధ్యత తీసుకుంటాయి. ఎందుకంటే ప్రాజెక్ట్ ఒప్పందంలో భాగంగా ఆయా మెషీన్లకు ఆ కంపెనీలు మెయింటెనెన్స్ వారంటీ ఇస్తాయి. పంప్ హౌస్ కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారంటీ కాలంలో వారే వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. వరదలు తగ్గిన తర్వాత అధికారుల ఫిర్యాదు మేరకు ఆయా కంపెనీల ప్రతినిధులు పంప్ హౌస్ లను సందర్శించి రిపెయిరింగ్ వర్క్ మొదలు పెడతారు. తిరిగి మెషినరీ అంతా పూర్తిగా పనిచేసేలా చూసి ఆ తర్వాత నిర్వహణ ఇంజినీర్లకు అప్పగిస్తారు. వరద తగ్గిన తర్వాత దాదాపు 3 లేదా నాలుగు నెలలలో ఈ తతంగం అంతా పూర్తవుతుంది. అప్పటి వరకూ ఎత్తిపోతల పనులు జరగవు అంతే.. అంతకు మించి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతోందన్న వార్తలన్నీ అవాస్తవం.

First Published:  15 July 2022 11:24 AM GMT
Next Story