Telugu Global
Telangana

తెలంగాణ లో రాజ‌న్న రాజ్యం అవ‌స‌రం లేదు..ష‌ర్మిలపై K.A.పాల్ ఘాటు వ్యాఖ్య‌లు

రాజ‌న్న రాజ్యం తెలంగాణలో ఎందుకు తీసుకురావాలి అని K.A.పాల్ ప్ర‌శ్నించారు. తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు రాజ‌న్న రాజ్యం అవ‌స‌రం లేద‌న్నారు. రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదని ఆయన చెప్పారు.

తెలంగాణ లో రాజ‌న్న రాజ్యం అవ‌స‌రం లేదు..ష‌ర్మిలపై K.A.పాల్ ఘాటు వ్యాఖ్య‌లు
X

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌పై మ‌త ప్ర‌చార‌కుడు, ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు K.A.పాల్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అధికారంపై ఆశ‌తోనే ఆమె తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆమె ఇక్క‌డ పాద‌యాత్ర‌లు చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌న్నారు. రాజ‌న్న రాజ్యం ఇక్క‌డ ఎందుకు తీసుకురావాలి అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు రాజ‌న్న రాజ్యం అవ‌స‌రం లేద‌న్నారు. రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పారు.

షర్మిల సోదరుడు వైఎస్ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేశారని ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజన్న రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని పాల్ అన్నారు. షర్మిల కూడా తన అన్న అడుగుజాడల్లో నడుస్తోందని తెలంగాణలో తన సోదరుడిలా క్రూర పాలనను తీసుకురావాల‌నుకుంటున్నారా అని K.A.పాల్ నిలదీశారు.

తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు తనకు చాలా సమయం ఉందని అన్నారు.

K.A.పాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. 2019 ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీచేశారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎక్కడ ఎన్నిక‌లు జ‌రిగినా పోటీ చేయ‌డం, అవిపూర్త‌య‌న వెంట‌నే అక్క‌డి నుంచి ఇల్లు ఖాళీ చేసిన‌ట్టు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎన్నిక‌లు వ‌స్తే మ‌ళ్ళీ ప్ర‌త్య‌క్షం. మునుగోడు ఉప ఎన్నిక‌లో ఆయ‌న ప్ర‌చార విన్యాసాలు మంచి వినోదాన్ని పంచిన వైనం అంతా చూసిందే.

First Published:  3 Dec 2022 8:02 AM GMT
Next Story