Telugu Global
Telangana

సచివాలయం ఉద్యోగుల లంచ్ బాక్సుల తనిఖీ లేదు.. ఐడీ కార్డ్ చూపిస్తే చాలు

ఉద్యోగులకు ఏర్పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లారు.

సచివాలయం ఉద్యోగుల లంచ్ బాక్సుల తనిఖీ లేదు.. ఐడీ కార్డ్ చూపిస్తే చాలు
X

సచివాలయం ఉద్యోగుల లంచ్ బాక్సుల తనిఖీ లేదు.. ఐడీ కార్డ్ చూపిస్తే చాలు

తెలంగాణ సచివాలయానికి రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు అందరూ ఇదే భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీకి సంబంధించి పలు నిబంధనలు అమలు చేస్తున్నారు.


సచివాలయం ప్రారంభమైన తర్వాత ఉద్యోగులు తమకు కేటాయించిన కార్యాలయాల్లో పనులు ప్రారంభించారు. అయితే మొదటి రోజు సెక్యూరిటీ, ఉద్యోగుల మధ్య కాస్త గందరగోళం నెలకొన్నది. ఐడీ కార్డు చూపించి లోపలకు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడి నుంచి లోపలకు వెళ్లాలో తెలియక ఎంప్లాయీస్ అయోమయానికి గురయ్యారు.

ఉద్యోగులకు ఏర్పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లారు. సోమవారం సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఐఏఎస్ అధికారి శేషాద్రి సమావేశం అయ్యారు. ఇకపై ఉద్యోగుల ఐడీ కార్డులు మాత్రమే చూసి లోపలకు అనుమతించాలని, లంచ్ బాక్సులను తనిఖీలు చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. అలాగే వాహనాల్లో వెళ్లి, వచ్చే. అధికారులు, ఉద్యోగులను ఏ సమయంలో అయినా అనుమతించనున్నారు.

నడిచి వచ్చే ఉద్యోగులను ఆగ్నేయ, ఈశాన్య ద్వారాల గుండా అనుమతిస్తారు. ఉద్యోగుల బ్యాగులు, లంచ్ బాక్సులను తెరిచి చూపించడాన్ని ఇకపై కొనసాగించరు. అయితే కొత్త సచివాలయం భద్రత దృష్ట్యా కొంత కాలం పాటు బ్యాగులు, బాక్సులను మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేస్తారని అధికారులు చెప్పారు. ఇది కేవలం భద్రత కోసమే కానీ.. ఉద్యోగులను అవమానించడానికి కాదని స్పష్టం చేశారు.


ఉద్యోగుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యూసుఫ్ మియా షేక్, సచివాలయం అధికారులు, సిబ్బంది స్వాగతించారు. తమ సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నరేంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  2 May 2023 4:46 AM GMT
Next Story