Telugu Global
Telangana

మెట్రో టైమింగ్స్‌పై ప్రచారం ఫేక్‌.. - వెల్లడించిన హైదరాబాద్‌ మెట్రో అధికారులు

మెట్రో రైళ్ల రాకపోకల్లో ఎలాంటి మార్పూ చేయలేదని తెలిపారు. మెట్రో రైళ్లు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని స్పష్టం చేశారు.

మెట్రో టైమింగ్స్‌పై ప్రచారం ఫేక్‌.. - వెల్లడించిన హైదరాబాద్‌ మెట్రో అధికారులు
X

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో మార్పులు జరిగాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్‌ అని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెట్రో రైళ్ల రాకపోకల్లో ఎలాంటి మార్పూ చేయలేదని తెలిపారు. మెట్రో రైళ్లు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని స్పష్టం చేశారు.

సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రాకపోకలు ప్రారంభమవుతాయని.. నిర్ణయించలేదని అధికారులు వివరించారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి పైన పేర్కొన్న వేళ‌లపై కేవలం పరిశీలన మాత్రమే జరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. వాటిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ఈ వేళల అమలుపై ముందుగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులెవరూ మెట్రో రైళ్ల సమయం విషయంలో అయోమయానికి గురికావొద్దని, యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు.

First Published:  18 May 2024 1:16 PM GMT
Next Story