Telugu Global
Telangana

'ముందస్తు' వ్యూహంలో వెనకబడ్డ కాంగ్రెస్‌

గడువు పూర్తి కాకముందే అసెంబ్లీని రద్దు చేసే అవకాశముందనే మాట కాంగ్రెస్‌ నేతలు కూడా అంటున్నారు. ఈ అంచనాకు తగినట్టు ముందస్తుకు సన్నద్ధమయ్యే వ్యూహం పీసీసీ వద్ద ఉన్నట్టు కనిపించదు. ఈ పరిస్థితికి సంబంధించి `ఆరు` అంశాల్ని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ముందస్తు వ్యూహంలో వెనకబడ్డ కాంగ్రెస్‌
X

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రానున్నాయనే ఊహాగానాలు వారం రోజులుగా ఊపందుకున్నాయి. ఎన్నికలకు అవసరమైన రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది టీఆర్‌ఎస్‌. దాని తరువాత ప్రజల్లో పలుకుబడి, పునాది, తగిన నిర్మాణం గల కాంగ్రెస్‌ పార్టీ మాత్రం స్త‌బ్దుగానే ఉంది. 'మునుగోడు' ఉప ఎన్నిక ఫలితాల తరువాత ఆ పార్టీ మరింత డీలా పడినట్టుగా కనిపిస్తుంది. ముందస్తు మేఘాలు కమ్ముకొస్తున్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి రాగాలు సద్దుమణగలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఒకనాటి నేత మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆయనని ఆపడానికి ఎవరూ ప్రయత్నించిన దాఖాలాల్లేవు. మున్ముందు ఇంకా ఎవరెవరు పార్టీని వీడనున్నారన్న వార్తలే తిరగాడుతున్నాయి.

ఆ మధ్య కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పీసీసీ నాయకులు సమావేశమయ్యారు. కానీ, కొత్త ఉత్సాహమేదీ పొడసూపలేదు. అసంతృప్తుల్ని పక్కన పెట్టి ఒక్కతాటిన నిలబడి టీఆర్‌ఎస్‌ని ఎదుర్కొవాలన్న సంకల్పం కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయిన తొలినాళ్ళలో రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ, కొన్ని వర్గాలకు చెందిన యువతలోనూ ఉత్సాహం నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని నిలదీసి ప్రశ్నించడంలో, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ పదునుగా మాటల తూటాలు విసరడంలో రేవంత్‌రెడ్డికి సాటి రాగల నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో మరొకరు కనిపించరు. ఇది ఆ పార్టీకీ, రేవంత్‌ రెడ్డికి సానుకూల అంశం. ఇదే సమయాన రేవంత్‌రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకుపోగల సంయమనం, వ్యూహనిపుణత, రాజకీయ కౌశల ప్రదర్శనలో మెరుగుపడాల్సి వున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు ఎంతవరకు సిద్ధంగా ఉందన్నదే అసలు ప్రశ్న.

గడువు పూర్తి కాకముందే అసెంబ్లీని రద్దు చేసే అవకాశముందనే మాట కాంగ్రెస్‌ నేతలు కూడా అంటున్నారు. ఈ అంచనాకు తగినట్టు ముందస్తుకు సన్నద్ధమయ్యే వ్యూహం పీసీసీ వద్ద ఉన్నట్టు కనిపించదు. ఈ పరిస్థితికి సంబంధించి `ఆరు` అంశాల్ని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఒకటి: రాష్ట్ర కాంగ్రెస్‌కు నిర్దిష్టమైన వ్యూహం వుంటే ఇప్పటికే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగల అభ్యర్థుల ఎంపిక జరగాలి. కనీసం ఒక్కో స్థానంలో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించే ఒకరిద్దరు నేతలు తమ నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా కనిపించాలి. పోటీకి తలపడాలని తలచేవారు తొలుత నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టపడి పనిచేయాలి. ఈ వైపుగా జిల్లాలోని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేసిన జాడ లేదు. చాలా జిల్లాల్లో డీసీసీలు (జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు) నిస్తేజంగా ఉన్నాయి. ఈ పూర్వరంగంలో తెలంగాణలోని 119 సీట్లకు తగిన గట్టి అభ్యర్థుల్ని కాంగ్రెస్‌ పార్టీ పోటీకి దింపడం అనుమానమేనని అంటున్నారు పరిశీలకులు.

రెండు: ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరి అయ్యింది. సీపీఐ, సీపీఎం పార్టీలు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్ధపడ్డాయి. ఆ పార్టీ కలుపుకొని పోగల పార్టీలేవి లేవు. ఒంటరిగా బరిలోకి దిగడం తప్ప మరో మార్గం లేదు. కోదండరామ్‌ పార్టీ నామమాత్రంగా మిగిలింది. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఇంకా మొగ్గదశలోనే ఉంది. ఏ ఇతర పార్టీల అండ లేకుండా ఒంటరిగా పోటీ చేయడం కాంగ్రెస్‌కు అనివార్యమైంది. ఇది ప్రతికూల అంశం.

మూడు: టీఆర్‌ఎస్‌ పాలనకన్నా తాము ఏవిధంగా మెరుగైన పాలన అందించగలమో చెప్పాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భిన్నవర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. వాటికి మించి తాము ప్రజల కోసం ఏం చేయగలమో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేయాలి. రైతుబంధు, వివిధవర్గాలకు అందిస్తున్న పెన్షన్లు, కల్యాణలక్ష్మి ఇంకా ఇతర‌త్రా సంక్షేమ పథకాల ఫలితాలు అందుకుంటున్న ఓటర్లు టీఆర్‌ఎస్‌వైపు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల్లో, యువతలో, ప్రభుత్వ ఉద్యోగుల్లో, మధ్యతరగతిలోని కొన్ని సెక్షన్లలో టీఆర్‌ఎస్‌ పాలన పట్ల ర‌వ్వంత అసంతృప్తి ఉన్నా.. ఈ వాస్తవాల నేపథ్యాన టీఆర్‌ఎస్‌ని కాదని తమ పార్టీకి అధికారం ఎందుకు కట్టబెట్టాలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు చెప్పాలి.

కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి వంటి అంశాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ వీటిని జనాలు అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకని విస్పష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికని, విధివిధానాలను ప్రజల ముందు పెట్టాలి. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇందుకు అవసరమైన కసరత్తు జరుగుతున్నట్టు క‌నిపించ‌డంలేదు.

నాలుగు: రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న పార్టీ మీద కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉండటం సహజం. ఈ అసంతృప్తిని అధికార పార్టీ మీద వ్యతిరేక పవనాలుగా రూపొందించే ఆయుధాలేమీ పీసీసీ వద్ద లేవు. కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోగల రాజకీయ చతురత, పకడ్బందీ వ్యూహం, పటిష్ట యంత్రాంగం అవసరం. వీటిని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంతవరకు సమకూర్చుకోగలదన్నది ప్రశ్న.

అయిదు: అధికారమే లేని పార్టీలో కుమ్ములాటలు తక్కువ ఉండాలి. అసంతృప్తుల వల్ల, అంతర్గత ఘర్షణల వల్ల తమకు ఒరిగేదేమీ లేదన్న విజ్ఞత కావాలి. కనుక పార్టీలోని వివిధస్థాయిల్లో ఉన్న నాయకులందరినీ కలుపుకుపోగల సామర్థ్యం సంతరించుకుంటేనే పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో సమర్థంగా తలపడగలరు. అధ్యక్షునికి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ సహకరించాలి. ఈ దిశగా పార్టీలో ఐక్యతని సాధించి ఎన్నికల బరిలో నిలిపేందుకు ఏఐసీసీ నుంచి లభించే మార్గదర్శకత్వం ఎంత అన్నది మరో ప్రశ్న.

ఆరు: ప్రచారానికి సంబంధించి మీడియా, సోషల్‌ మీడియా అవసరం చాలా ముఖ్యం. కానీ కాంగ్రెస్‌కు అండగా నిలిచే ఓ దిన పత్రిక కానీ, టీవీ ఛానల్‌ కానీ లేవు. అలాగే సోషల్‌ మీడియా యంత్రాంగం బలహీనంగా ఉంది. యూత్‌ను ఆకట్టుకోవాలంటే సోషల్‌ మీడియా బలంగా పనిచేయాలి. పీసీసీ ప్రచార యంత్రాంగానికి ఇదే పెద్ద కొరత. ఈ బలహీనత పెద్ద మైనస్‌ పాయింట్‌. దీనిని అధిగమించే ప్రయత్నం సందేహాస్పదం.

కనుక ముందస్తు ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ పార్టీ ఇరకాటంలో పడుతుందా..? ఎన్నికలను ఎదుర్కోలేక డీలా పడుతుందా..? రాష్ట్రంలో కాంగ్రెస్‌ను లేకుండా చేయాలనే టీఆర్‌ఎస్‌ వ్యూహం ఫలిస్తుందా..? వేచి చూడాలి మరి!

First Published:  1 Dec 2022 10:43 AM GMT
Next Story