Telugu Global
Telangana

అలాంటప్పుడు నూపుర్ శర్మను ఎందుకు సస్పెండ్ చేశారు ?

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల రచ్చ ఇంకా ఆగడం లేదు. నుపుర్ శర్మను వ్యతిరేకించినందుకు కేటీఆర్ పై విమర్శలు చేస్తున్న రైట్ వింగ్ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ మొహంపై గుద్దినట్టు సమాధానమిచ్చారు.

అలాంటప్పుడు నూపుర్ శర్మను ఎందుకు సస్పెండ్ చేశారు ?
X

''నాదేశం అభివృద్ది, సంక్షేమమే నేను నమ్మిన మతం. నేను అభివృద్ది జాతీయవాదిని'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. శుక్రవారం జరిగిన ఆస్క్ కేటీఆర్ అనే ట్విట్టర్ కార్యక్రమంలో ఓ నెటిజన్ కు కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై హిందుత్వవాది, స్వరాజ్య అనే హిందుత్వ పత్రికకు కన్సెల్టింగ్ ఎడిటర్ ఆనంద్ రంగనాథన్ చేసిన విమర్శ‌లకు కేటీఆర్ ఇవ్వాళ్ళ సూటిగా సమాధానమిచ్చారు.

ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఓ నెటిజన్, మహ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. దానికి కేటీఆర్ సమాధాన మిస్తూ... ''నూపుర్ శర్మ చేసిన పని మన‌ దేశానికి అవమానాన్ని తెచ్చిపెట్టింది. మనల్ని ఈ ప్రపంచం ముందు చెడ్డ వారిగా నిలబెట్టింది.ఆమె లాంటి మూర్ఖురాలికి మద్దతు ఇవ్వడం మరింత సిగ్గుచేటు'' అని సమాధానం ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన సమాధానం రైట్ వింగ్ కార్యకర్తలకు కంటగింపుగా మారింది. ఆయనను లక్ష్యంగా చేసుకొని విమర్శ‌లు ప్రారంభించారు. అందులో భాగంగానే రైట్ వింగ్ కార్యకర్త స్వరాజ్య పత్రిక కన్సెల్టింగ్ ఎడిటర్ ఆనంద్ రంగనాథన్ కూడా విమర్శ‌లు గుప్పించారు.

''నుపుర్ శర్మ మాట్లాడిన మాటల్లో తప్పేం ఉంది ఆమె ఇస్లామిక్ గ్రంథాల్లో ఉన్నదానినే ఉల్లేఖించింది. అది దేశానికి అవమానమెలా అవుతుంది. కేటీఆర్, మీరు చాలా ఇస్లామోఫోబిక్'' అంటూ ట్వీట్ చేశారు.

ఆనంద్ రంగనాథన్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ చాలా సౌమ్యంగా, సూటిగా వరస ట్వీట్లతో సమాధానమిచ్చారు.

''నాదేశం అభివృద్ది, సంక్షేమమే నామతం. నేను అభివృద్ది జాతీయ వాదిని. నుపుర్ శర్మ ది తప్పు కాకపోతే ఆమెను బీజేపీ ఎందుకు సస్పెండ్ చేసింది? ప్రభుత్వం ఇతర దేశాలకు అంతగా ఎందుకు క్షమాపణలు చేప్తోంది? ఈప్రశ్నలను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్నినడుపుతున్నవారిని అడగండి'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో

''ఆనంద్, నా పేరు రామ్

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము గ్రామానికి ఒక నెల క్రితమే విద్యుద్దీకరణ జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇప్పటికీ ప్రజలకు సురక్షితమైన తాగునీరు, కరెంటు ఇవ్వలేకపోతున్నాం

కానీ మన దృష్టేమో ఎవరి దేవుడు గొప్పవాడు అనే దాని మీద ఉంది

మనది ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన దేశం; ప్రస్తుతం భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర‌ వేడుకలను జరుపుకుంటుంది.

మనకు అనేక మంది దేవుళ్లు , లక్షలాది ప్రార్థనా స్థలాలు ఉన్నాయి

కానీ మనకు ఇప్పటికీ తగినన్ని విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేవు

మనం ఇప్పటికైనా అనవసర విషయాలపై కాక దేశాన్ని అత్యుత్త‌మంగా తీర్చి దిద్దేందుకు కావాల్సిన అంశాల మీద దృష్టి పెడదాం '' అని కేటీఆర్ ట్వీట్ చేసి ఆనంద్ రంగనాథన్ కే కాక మతం పేరుతో రాజకీయాలు నడిపే నాయకులకు , వారి అనుచరులకు సౌమ్యంగానే కాక మొహంపై గుద్దినట్టు సమాధానమిచ్చారు.

.

First Published:  7 Aug 2022 8:06 AM GMT
Next Story