Telugu Global
Telangana

అప్పట్లో రవి.. ఇప్పుడు చిరంజీవి.. తుంగతుర్తిలో కాంగ్రెస్‌కే నష్టం తప్పదా?

రెండు నియోజకవర్గాలపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రభావం ఉన్నది. ఆయనకు సూర్యాపేట టికెట్ ఇస్తే తుంగతుర్తిలో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

అప్పట్లో రవి.. ఇప్పుడు చిరంజీవి.. తుంగతుర్తిలో కాంగ్రెస్‌కే నష్టం తప్పదా?
X

కాంగ్రెస్ పార్టీ మూడో లిస్టులో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ అభ్యర్థులను ఖరారు చేయలేదు. సీపీఎంను ఎలాగైనా బుజ్జగించి బరిలో నుంచి తప్పించేందుకు ఏఐసీసీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే మిర్యాలగూడ టికెట్‌ను వాళ్ల కోసం పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా అక్కడ టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా పావులు కదుపుతున్నారు. ఇక ఈ సెగ్మెంట్‌ను వదిలేస్తే తుంగతుర్తి, సూర్యాపేట అభ్యర్థులపై పీటముడి వీడటం లేదు.

ఈ రెండు నియోజకవర్గాలపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రభావం ఉన్నది. ఆయనకు సూర్యాపేట టికెట్ ఇస్తే తుంగతుర్తిలో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. కానీ సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుండటం, ఆయనకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి మద్దతు ఉండటంతో ఏఐసీసీ టికెట్‌పై ఎటూ తేల్చడం లేదు.

ఇక తుంగతుర్తి నుంచి గతంలో పోటీ చేసిన అద్దంకి దయాకర్‌తో పాటు మందుల సామేలు, ప్రీతమ్, పిడమర్తి రవి, ఇటికాల చిరంజీవి తదితరులు పోటీ పడుతున్నారు. దయాకర్ రెండు సార్లు ఓడిపోయాడని.. మరోసారి ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కొంత మంది నాయకులు ఏఐసీసీకి లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపు తుంగతుర్తిలో మందుల సామేలుకు టికెట్ ఇస్తే గెలుస్తాడంటూ మరో వర్గం పట్టుబుడుతోంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఇటికాల చిరంజీవి సోమవారం రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. తుంగతుర్తి అభ్యర్థి ప్రకటనలో ఏఐసీసీ జాప్యాన్ని నిరసిస్తూనే తాను నామినేషన్ వేశానని చిరంజీవి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కూడా తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ నాయకుడు వడ్డేపల్లి రవి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశాడు. స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసినా.. ఆయన నామినేషన్ విత్‌డ్రా చేసుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఆ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ 2500 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయారు.

ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ రెబెల్‌గా చిరంజీవి బరిలో ఉన్నారు. రేపు ఎవరికి టికెట్ వచ్చినా చిరంజీవితో నామినేషన్ ఉపసంహరింప చేయడానికి తప్పకుండా ప్రయత్నించాలి. లేకపోతే మరోసారి కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోవడం ఖాయమని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇవ్వాళో రేపో తుంగతుర్తి టికెట్‌పై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తున్నది. మరి టికెట్ ఎవరికి ఇచ్చినా చిరంజీవి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

First Published:  7 Nov 2023 6:37 AM GMT
Next Story