Telugu Global
Telangana

గ్రేటర్‌లో గెలుపునకు వాళ్ల ఓట్లే కీలకం!

యువకులు, ఉద్యోగులను పోలింగ్ బూత్‌లకు కప్పించడానికి మూడు జిల్లాలకు చెందిన ఎన్నికల అధికారులు చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.

గ్రేటర్‌లో గెలుపునకు వాళ్ల ఓట్లే కీలకం!
X

గ్రేటర్‌లో గెలుపునకు వాళ్ల ఓట్లే కీలకం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెగ్మెంట్లు విభిన్నమైనవి. రాష్ట్రంలోని మిగిలిన సెగ్మెంట్లతో పోలిస్తే.. గ్రేటర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అర్బన్ ఓటర్లే ఉంటారు. రాజధాని పరిధిలో కోటి మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సెటిలర్లు, ముస్లిం మైనార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. ఇక వీరు కాకుండా యువత కూడా భారీ సంఖ్యలో ఉన్నారు.

రాజధాని పరిధిలోని కోటి మంది ఓటర్లలో దాదాపు సగం మంది 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్-మల్కాజిగిరి పరిధిలోని 28 నియోజకవర్గాలను పరిశీలిస్తే.. దాదాపు అన్ని సెగ్మెంట్లలో సగం మంది యువకులు కనిపిస్తున్నారు. వీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఈ క్రమంలో యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఎన్నికల కమిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

యువతతో ఓటు వేయించాలని రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సాయంత్రం సమయంలో ఆయా నియోజకవర్గాల్లోని కాలనీలు, ప్లే గ్రౌండ్స్, టీ స్టాల్స్ వద్ద తిరుగుతూ యువతను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నగర శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 18, 19 ఏళ్ల ఓటర్లు 10వేల నుంచి 12 వేల వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లోనే 20 నుంచి 29 ఏళ్ల వయసున్న ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు.

నగరంలో కోటి మందికి వరకు ఓటర్లు ఉన్నా.. ప్రతీ సారి ఆయా నియోజకవర్గాల్లో 50 శాతం కంటే తక్కువ ఓటింగే నమోదవుతున్నది. గత ఎన్నికల సమయంలో వరుసగా సెలవలు రావడంతో చాలా మంది ఓటు వేయకుండా ఊర్లకు వెళ్లిపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, యువకులు అసలు పోలింగ్ బూత్‌కు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. దీంతో ఈ సారి ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోంది. పోలింగ్ డేట్‌కి అటు, ఇటు ఎలాంటి సెలవలు లేకుండా చూసుకున్నది.

యువకులు, ఉద్యోగులను పోలింగ్ బూత్‌లకు కప్పించడానికి మూడు జిల్లాలకు చెందిన ఎన్నికల అధికారులు చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. విద్యా సంస్థల్లో కూడా ఓటరు నమోదు కార్యక్రమాలు పెట్టి కొత్త ఓటర్లను చేర్పించారు. ఇక నియోజకవర్గంలో ఒక 'యూత్ థీమ్' పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి దాదాపు 50 లక్షల మంది వరకు ఉన్న యువ ఓటర్లు ఈ సారి ఏ పార్టీకి మొగ్గు చూపితే.. గ్రేటర్‌లో ఆ పార్టీకే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉన్నది.

First Published:  5 Nov 2023 6:05 AM GMT
Next Story