Telugu Global
Telangana

ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేదింపుల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్‌ నవ్య చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలని డీజీపీకి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాశారు. ఒక వేళ నవ్య ఆరోపణలు నిజమని తేలితే రాజయ్యపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.

ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేదింపుల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్
X

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని జనగాం జిల్లా జానకీపురం సర్పంచ్ 'నవ్య' మీడియా ముందుకొచ్చారు. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బుతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానంటూ ప్రలోభపెడుతున్నారని ..తనకే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది సర్పంచ్ నవ్య.

దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్‌ నవ్య చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలని డీజీపీకి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాశారు. ఒక వేళ నవ్య ఆరోపణలు నిజమని తేలితే రాజయ్యపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.

ఇటువంటి వివాదాలు రాజయ్యకు కొత్తకాదు. అనేక సార్లు ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఆయన ప్రవర్తన గురించి అనేక విమర్శ‌లున్నాయి. గతంలో ఇలాంటి ఆరోపణలతోనే ఆయన‌ డిప్యూటీ సీఎం పదవి కోల్పోయారన్న వాదనలూ ఉన్నాయి.

ముఖ్యమంత్రి, బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ కూడా రాజయ్య వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  12 March 2023 5:19 AM GMT
Next Story