Telugu Global
Telangana

ఉగ్ర గోదారి.. గ్రామాలకు రాకపోకలు బంద్..

భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 49.3 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

ఉగ్ర గోదారి.. గ్రామాలకు రాకపోకలు బంద్..
X

గోదారమ్మ శాంతించినట్టే శాంతించి మళ్లీ ఉగ్రరూపం చూపిస్తోంది. నెలరోజుల వ్యవధిలో ఇది రెండో భారీ వరదగా గోదావరి చరిత్రలో నిలిచిపోయే అవకాశముందని అనుమానిస్తున్నారు. గత నెలలో వచ్చిన వరదలతో 16వేల కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాయి. ఈ దఫా పరిస్థితి ఎలా ఉంటుందోనని గోదావరి పరివాహక ప్రజలు హడలిపోతున్నారు.

గత నెల వరద కష్టాలనుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కాస్త బయటపడుతున్నారు. పొలాల్లో చేరిన వరదనీరు వెళ్లిపోవడంతో తిరిగి సాగుకి సిద్ధమవుతున్నారు. కానీ అంతలోనే మళ్లీ గోదావరిలో నీటి మట్టం పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 49.3 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా.. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరుకునే అవకాశముంది. అటు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దీంతో చర్ల, వెంకటాపురం రూట్లలో అధికారులు బస్సులు నిలిపివేశారు. డొంకవాగు పొంగడంతో సున్నంబట్టి- బైరాగులపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారి మునిగి స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. తుపాకుల గూడెం వద్ద రహదారి తెగిపోయింది. భద్రాచలంలో నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

ఖాళీ అవుతున్న బూర్గంపాడు

ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని, పెన్ గంగ నదుల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గత వరదలను దృష్టిలో పెట్టుకుని బూర్గంపాడు మండల ప్రజలు ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు మండలంలోని గ్రామాలు ఖాళీ చేయాలంటూ చాటింపు వేయిస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. వరద ప్రవాహం ఇలాగే ఉంటే మరోసారి ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారు ప్రజలు.

First Published:  10 Aug 2022 2:30 AM GMT
Next Story