Telugu Global
Telangana

గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం

ఎలాంటి కారణాలు కూడా చెప్పకుండా బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారని పిటిషన్‌లో ప్రభుత్వం వివరించింది. వెంటనే గవర్నర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం
X

గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సుదీర్ఘకాలం పాటు గవర్నర్ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సీఎస్ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం గవర్నర్‌ వద్ద మొత్తం 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఆమె ఆమోదించడం కానీ, తిరస్కరించడం గానీ చేయకుండా తొక్కిపెట్టారు. ఎలాంటి కారణాలు కూడా చెప్పకుండా బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారని పిటిషన్‌లో ప్రభుత్వం వివరించింది. వెంటనే గవర్నర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

గవర్నర్ తొక్కిపెట్టిన బిల్లుల్లో పలు కీలకమైనవి కూడా ఉన్నాయి. యూనివర్శిటీల్లో నియామకాల కోసం బోర్డు ఏర్పాటు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, జీఎస్టీ చట్ట సవరణ, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్టం, మోటార్ వెహికల్ టాక్సెస్ చట్ట సవరణ బిల్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ పదవి కాలం పెంపు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసానికి సంబంధించి కాలపరిమితి పెంపు వంటి బిల్లులు ఉన్నాయి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య వివాదం ముదిరి హైకోర్టు వరకు వెళ్లింది. చివరకు ఇరుపక్షాలు ఒక రాజీ మార్గానికి రావడంతో ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు పెండింగ్ బిల్లుల అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

గవర్నర్‌ బిల్లులను ఆమోదించడమో లేక తిరస్కరించడమో చేస్తారు. తిరస్కరిస్తే ఆ బిల్లును మరోసారి గవర్నర్‌కు ప్రభుత్వం పంపితే ఆమోదించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకోకుండా బిల్లులను తన వద్ద పెట్టుకున్నారు. ప్రభుత్వ పిటిషన్‌ను రేపు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

First Published:  2 March 2023 11:27 AM GMT
Next Story