Telugu Global
Telangana

57 ఎకరాల ఓయూ భూముల కోసం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్వయంగా జిల్లా కోర్టుకు హాజరపై.. సదరు 57 ఎకరాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు వేసిన పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోరారు.

57 ఎకరాల ఓయూ భూముల కోసం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
X

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన 57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూములు చాలా ఏళ్లుగా కబ్జాకు గురవుతున్నాయి. రూ.వేల కోట్ల విలువైన ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.

రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్వయంగా జిల్లా కోర్టుకు హాజరపై.. సదరు 57 ఎకరాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు వేసిన పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోరారు. ఆయా భూములకు వారు లీగల్ హక్కుదారులు లేదా వారసులు కాదని.. సదరు వ్యక్తులు చెబుతున్నట్లు అవి నిజమైన డాక్యుమెంట్లు కావని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వానికి చెందిన అత్యంత విలువైన భూములను తమవే అని చెప్పుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు.

ఉస్మానియా యూనివర్సిటీ కోసం చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల నుంచి అప్పటి నిజాం సర్కారుకు చెందిన భూములను కేటాయించారు. ఇందులో 57 ఎకరాలను తమవే అని చెప్పుకుంటూ తప్పుడు డాక్యుమెంట్లతో క్లెయిమ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. నిజాం సర్కారు 1920లో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హబ్సిగూడ, లాలాగూడ, రామాంతాపూర్, అంబర్‌పేట, జమిస్తాన్‌పూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూములను కేటాయించింది.

ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్ అవసరాలకు మరిన్ని భూములు అవసరం అవుతాయని అధికారులు భావించి.. 1931లో అదనపు ల్యాండ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో 301 ఎకరాల భూములను జైనుద్దీన్ మక్తెదార్ అనే వ్యక్తికి పరిహారం చెల్లించి 1932లో ఉస్మానియాకు సదరు భూములను బదిలీ చేశారు. అయితే జైనుద్దీన్ వారసుడిని అని చెప్పుకుంటున్న హబీబుద్దీన్ అనే వ్యక్తి.. ఈ భూములపై తనకు హక్కు ఉందని చెప్పుకొని దాదాపు 57 ఎకరాల వరకు అమ్మేసుకున్నాడు.

భూములకు పరిహారం చెల్లించి.. ప్రభుత్వానికి బదిలీ చేసిన చాలా ఏళ్ల తర్వాత.. వాటిపై మాకు హక్కు ఉందని వాదించడం సమంజసం కాదని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమే అని.. ఇతర ప్రైవేటు వ్యక్తులకు ఎవరికీ దీన్ని క్లెయిమ్ చేసుకునే హక్కే లేదని వాదించారు. అంతే కాకుండా జైనుద్దీన్‌కు అసలు పిల్లలే లేరని.. కానీ ఇప్పుడు తాను వారసుడిని అని చెప్పుకుంటున్న హబీబుద్దీన్ ఎవరో తేల్చాల్సిన అవసరం కూడా ఉందని పేర్కొన్నారు.

కాగా, గతంలో జైనుద్దీన్ తనకు కొంత భూమి కావాలని ప్రభుత్వాన్ని కోరగా.. అప్పటి పాలకులు 9 ఎకరాలు ఇస్తామంటూ మాట ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చకుండానే చనిపోయారు. మరోవైపు హబీబుద్దీన్ మాత్రం 1964 నుంచి ఓయూ భూములను క్రమంగా అమ్ముకుంటూ వచ్చారు. దీంతో ఆయనపై కబ్జా కేసులను ప్రభుత్వం నమోదు చేసింది. హబీబుద్దీన్ నుంచి భూములు కొనుగోలు చేసిన వారిపై కూడా కబ్జా కేసులు పెట్టింది.

First Published:  24 May 2023 6:08 AM GMT
Next Story