Telugu Global
Telangana

తెలంగాణ సాధించిన ప్రగతిని పల్లెపల్లెన ఎలుగెత్తి చాటాలి : మంత్రి సబిత ఇంద్రారెడ్డి

జూన్ 2న అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ.. వారికి నివాళులు అర్పించి ఉత్సవాలు ప్రారంభించాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు.

తెలంగాణ సాధించిన ప్రగతిని పల్లెపల్లెన ఎలుగెత్తి చాటాలి : మంత్రి సబిత ఇంద్రారెడ్డి
X

స్వరాష్ట్రంలో తెలంగాణ సాధించిన ప్రగతిని పల్లెపల్లెలో ప్రజలకు వివరించాలని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. తొలి రోజు ఆయా జిల్లాల్లో మంత్రులు ఉత్సవాలను ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ..

ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రతీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి చెప్పారు. జూన్ 2న అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ.. వారికి నివాళులు అర్పించి ఉత్సవాలు ప్రారంభించాలని చెప్పారు.

జూన్ 22న అమర వీరుల సంస్మరణ సభ, అమర వీరుల స్తూపం ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ముగుస్తాయని మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. 21 రోజల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించి.. తెలంగాణ ప్రగతిని ప్రతీ ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలని మంత్రి సూచించారు. రాష్ట్రం రాక ముందు ఉన్న పరిస్థితులు.. వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.

రాష్ట్రం ఏర్పాటు లాగానే.. వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనే చిరకాల వాంఛ నెరవేరిందని.. కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత దగ్గరయ్యిందని అన్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంతో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుల వృత్తుల వారికి రూ.1 లక్ష ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి.. ఉత్సవాల్లో భాగంగా వారికి అందజేయాలని అధికారులకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు.

First Published:  27 May 2023 9:26 AM GMT
Next Story