Telugu Global
Telangana

ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చాల్సిందే.. హైకోర్టుకు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం

కొత్త ఆసుపత్రి భవనాన్ని కట్టాలంటే.. పాత భవనాన్ని తప్పకుండా కూల్చాలని తెలిపింది.

ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చాల్సిందే.. హైకోర్టుకు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నదని.. దాన్ని కూల్చివేయడం తప్ప వేరే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టుకు తాజాగా ఒక అఫిడవిట్ సమర్పించింది. ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనాన్ని కట్టాలంటే.. ఇప్పుడు ఉన్న పాత భవనాన్ని కూల్చడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చవద్దంటూ హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్‌డీఏ) హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనికి ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

గతంలో ఈ పిల్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక మెమో సమర్పించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనానికి సంబంధించి ఒక అత్యున్నత అధికార కమిటీని నియమిస్తామని.. అది పూర్తిగా పరిశీలిస్తుందని పేర్కొన్నది. ఇక తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి విషయాలు వెల్లడించింది. ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం అక్కడ అందుబాటులో ఉన్న భూమికి మధ్యలో ఉన్నదని చెప్పింది. అక్కడ కొత్త ఆసుపత్రి భవనాన్ని కట్టాలంటే.. పాత భవనాన్ని తప్పకుండా కూల్చాలని తెలిపింది. ఓల్డ్ బిల్డింగ్ కూల్చేస్తేనే తప్ప కొత్తగా 1,812 బెడ్ల భవనాన్ని కట్టడానికి వీలు పడదని పేర్కొన్నది.

గతంలో వారసత్వ కట్టడాల పరిరక్షకులు, కార్యకర్తలు పురాతన బిల్డింగ్‌ను కూల్చకుండా, స్మారక చిహ్నంగా కొనసాగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఓల్డ్ బిల్డింగ్ కూల్చి వేయాలనే హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు కూడా అదే విషయానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నది.

ఉస్మానియా ఆసుపత్రి హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ నుంచి అనేక మంది రోగులు నిత్యం వస్తుంటారని తెలిపింది. ఇక్కడ కొత్త భవనం కట్టి.. మరిన్ని వసతులు పెంచితే కానీ పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి వీలు పడదని పేర్కొన్నది. ఇప్పుడున్న భవనంలో అనేక విభాగాలు కొనసాగించడం కష్టమని, పైగా భవనం పై పెచ్చులు అప్పుడప్పుడు ఊడుతూ వైద్య సిబ్బంది, రోగులకు ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నది.

ఈ భవనం అసుపత్రి నిర్వహణకు అనుకూలంగా లేదని, పేషెంట్లకు ఇబ్బందికరంగా మారిందని అనేక మంది నిపుణులు ఇప్పటికే ఏకగ్రీవంగా తెలియజేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నది. కాబట్టి ఈ భవనం పూర్తిగా కూల్చి వేస్తే తప్ప కొత్త బిల్డింగ్ నిర్మాణం కుదరదని అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

First Published:  7 Sep 2023 4:03 AM GMT
Next Story