Telugu Global
Telangana

మూసీ మురికికూపంగా మారడానికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం : మంత్రి కేటీఆర్

మూసీని పరిరక్షించడమే కాకుండా, సుందరీకరణ కూడా చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానిలో భాగంగానే ఈ రోజు ఒక కీలకమైన ముందడుగు పడుతున్నదని కేటీఆర్ అన్నారు.

మూసీ మురికికూపంగా మారడానికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం : మంత్రి కేటీఆర్
X

ఒకప్పుడు మూసీ ఎంతో సుందరంగా ఉండేది. హైదరాబాద్ మహా నగరానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడానికి మూసీ నది కూడా ఒక కారణం. అంతటి అద్భుతమైన నదిని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మురికి కూపంగా మారిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఈసా, మూసీ నదులపై జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు కొత్త ఐకానిక్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇందులో ఒక బ్రిడ్జి నిర్మాణానికి ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి ఫతుల్లగూడా వద్ద నేరుగా, మిగిలిన నాలుగింటిని వర్చువల్ పద్దతిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

మూసీని పరిరక్షించడమే కాకుండా, సుందరీకరణ కూడా చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానిలో భాగంగానే ఈ రోజు ఒక కీలకమైన ముందడుగు పడుతున్నదని అన్నారు. ఈసా, మూసా కలిసి మూసీ ఏర్పడింది. 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరానికి మూసీనే అప్పట్లో ఆధారం. ఇప్పుడు ఆ నది పూర్తిగా కలుషితం అయ్యింది. కానీ ప్రభుత్వం ఆ నీటిని శుద్ధి చేయాలనే సంకల్పంతో ఎస్టీపీలను నిర్మిస్తోందని చెప్పారు. 2000 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని అన్నారు.

దుర్గంచెరువు దగ్గర 7 ఎంఎల్‌డీ కెపాసిటీతో ఎస్టీపీ నిర్మించాము. 2వేల ఎంఎల్‌డీ ఎస్టీపీలు కూడా పూర్తయితే.. మూసీలోకి పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని మాత్రమే వదిలే పరిస్థితి ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి అన్ని ఎస్టీపీలు పూర్తయి అందుబాటులోకి వస్తాయని అన్నారు.

ఫతుల్లాగూడ వద్ద రూ.52 కోట్లతో 200 మీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జికి ఇవ్వాళ శంకుస్థాపన చేసుకుంటున్నాము. ఇతర దేశాల్లో ఎలాంటి బ్రిడ్జిలు ఉన్నాయో.. అలాంటి నిర్మాణాలను ఇక్కడ చేపట్టనున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం కోసం ఇప్పటికే ఇంజనీర్లను ఫ్రాన్స్, గ్రీస్‌కు పంపి అధ్యయనం చేయించాము. దుర్గంచెరువు దగ్గర ఎలాంటి బ్రిడ్జి ఉందో.. అలాంటి నిర్మాణం ఫతుల్లాగూడ-పీర్జాదిగూడ మధ్య రాబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఐదు బ్రిడ్జిలతో పాటు మూసీ నదిపై మొత్తం 14 బ్రిడ్జిలు రాబోతున్నాయని అన్నారు. పైన మంచిరేవుల నుంచి కింద ఘట్‌కేసర్ వరకు మూసీ సుందరంగా మారుతుంది. ఈ బ్రిడ్జిల నిర్మాణంతో మరింత సుందరమవుతుందని కేటీఆర్ తెలిపారు.

మూసీ నదిపై నిర్మించే బ్రిడ్జిల కోసం రూ.545 కోట్ల మంజూరు చేశాము. ఇంకా ఎక్కువ ఖర్చు అయినా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మూసీపై ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మంచిరేవుల నుంచి నాగోల్ దాటిన తర్వాత ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వరకు రూ.10వేల కోట్లతో ఒక అద్భుతమైన బ్రిడ్జిని మూసీకి సమాంతరంగా కట్టాలనే ప్రతిపాదన ఉన్నది. అది పూర్తయితే ఔటర్ మీద చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి కేటీఆర్ చెప్పారు.


First Published:  25 Sep 2023 10:57 AM GMT
Next Story