Telugu Global
Telangana

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి.. 101 మెగావాట్ల లక్ష్యం పెట్టుకున్న మున్సిపల్ శాఖ

వ్యర్థాల నుంచి విద్యుత్ (వేస్ట్ టూ ఎనర్జీ) ఉత్పత్తి చేసే దుండిగల్ ప్రాజెక్టు జూలై చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి.. 101 మెగావాట్ల లక్ష్యం పెట్టుకున్న మున్సిపల్ శాఖ
X

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ 101 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అదేంటి.. విద్యుత్ ఉత్పత్తి చేయడం మున్సిపల్ శాఖ పని కాదు కదా.. అని ఆలోచిస్తున్నారా? నిజమే.. విద్యుత్ ఉత్పత్తి చేయడం మున్సిపల్ శాఖ పని కాకపోయినా.. హైదరాబాద్ నగరంలో భారీగా ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను ఉపయోగించి కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జవహర్‌నగర్ ఫేజ్-1 ప్లాంటు ద్వారా 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా.. మరో 15 మెగావాట్ల ఉత్పత్తి కోసం దుండిగల్‌లో కొత్త ప్లాంట్ నిర్మిస్తోంది.

వ్యర్థాల నుంచి విద్యుత్ (వేస్ట్ టూ ఎనర్జీ) ఉత్పత్తి చేసే దుండిగల్ ప్రాజెక్టు జూలై చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. మొత్తం 6 కేంద్రాల ద్వారా 101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే జవహర్‌నగర్ అందుబాటులోకి వచ్చింది. 2023 డిసెంబర్ చివరికి 15,400 మెట్రిక్ టన్నుల వ్యర్థాల ద్వారా 101 మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.

జీహెచ్ఎంసీ, దాని చుట్టుపక్కల మున్సిపాలిటీల నుంచి చెత్తను జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఇక్కడ ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను రాంకీ సంస్థ ఏర్పాటు చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను.. సెకండరీ కలెక్షన్, ట్రాన్స్‌ఫర్ పాయింట్ల ద్వారా జవహర్‌నగర్‌కు చేరుస్తున్నారు. అక్కడ యంత్రాలతో చెత్తను వేరు చేసి.. మండే గుణం గల వ్యర్థాలను ఒకవైపు పెడతారు. దీన్ని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.

Next Story