Telugu Global
Telangana

ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఛత్రపతి శివాజీ వారసుడి భేటీ

శంభాజీరాజే ఛత్రపతికి ప్రగతి భవన్ లో ఘన స్వాగతం లభించింది. శంభాజీరాజేను ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఛత్రపతి శివాజీ వారసుడి భేటీ
X

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, కొల్హాపూర్ రాజవంశీయుడు, మాజీ బీజేపీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి గురువారం ప్రగతి భవన్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. దేశ, జాతీయ రాజకీయాలలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.

శంభాజీరాజే ఛత్రపతికి ప్రగతి భవన్ లో ఘన స్వాగతం లభించింది. శంభాజీరాజేను ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను శంభాజీరాజే అడిగి తెలుసుకున్నారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయన కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికే పరిమితం కాకూడదని, మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ఆయన అన్నట్టు సమాచారం. అంతేకాక‌ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలూ సుదీర్ఘంగా చర్చించారు. దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమం, దేశ సమగ్రత తదితర‌ లక్ష్యాలతో ఒక ఉమ్మడి ఎజెండాను రూపొందించాల్సిన తక్షణ అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, అవసరమైనప్పుడు ఈ సమస్యలపై మరోసారి సమావేశమై చర్చించాలని వారు నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా తరతరాలుగా ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసులు దేశానికి చేసిన సేవలను ఇరువురు నేతలు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారి పాలన సాగిందని, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కేసీఆర్ అన్నారు. వారి స్ఫూర్తితో తెలంగాణలో కుల, మత వివక్ష లేకుండా ప్రజారాజ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

శంభాజీరాజే ఛత్రపతి ‘రాజర్షి సాహు ఛత్రపతి’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుకరించారు.

రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి సిహెచ్‌ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కె కవిత, ఎస్‌ మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు శంభాజీరాజే ఛత్రపతితో పాటు వచ్చిన పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

First Published:  26 Jan 2023 4:11 PM GMT
Next Story