Telugu Global
Telangana

హైదరాబాద్ లో చారిత్రాత్మక ఫార్ములా ఈ రేస్ నేడే ప్రారంభం

తొమ్మిదో సీజన్ , నాల్గవ రౌండ్ శనివారం జరుగుతుంది. గత 10 ఏళ్లలో దేశంలో ఇదే తొలి మోటార్ స్పోర్ట్ ఈవెంట్.

హైదరాబాద్ లో చారిత్రాత్మక ఫార్ములా ఈ రేస్ నేడే ప్రారంభం
X

హైదరాబాద్ నగరంలో సుందరమైన హుస్సేన్ సాగర్ ఒడ్డున , ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న స్ట్రీట్ సర్క్యూట్‌లో భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా ఈ రేస్ ఈ రోజు ప్రారంభం కానుంది.

తొమ్మిదో సీజన్ , నాల్గవ రౌండ్ శనివారం జరుగుతుంది. గత 10 ఏళ్లలో దేశంలో ఇదే తొలి మోటార్ స్పోర్ట్ ఈవెంట్.

2013లో గ్రేటర్ నోయిడాలో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేస్ జ‌రిగింది. అదే భారత్ లో చివరి రేస్.అయితే నేడు జరగనున్న నాన్-కార్బన్ ఎమిషన్ ఈవెంట్ అయిన ఈ రేసు భారత్ లోనే మొదటిది. ఈ రేసును నిర్వహించిన నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ 27వ నగరం.

2.83 కి.మీ స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్‌లతో గరిష్ట వేగంతో Gen3 రేస్ కార్లు పోటీ పడుతున్నాయి.

కాగా, నిన్న ప్రీ ప్రాక్టీస్ కోసం 11 రేసింగ్ జట్లకు చెందిన డ్రైవర్లు తమ కార్లను ట్రాక్ లో నడిపించారు. అయితే సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సెషన్ ప్రారంభానికి ముందు, ఇందిరాగాంధీ విగ్రహం రోడ్డు నుండి రేసింగ్ ట్రాక్‌పైకి ఇతర‌ వాహనాలు ట్రాక్‌లోకి చొచ్చుకు రావడంతో ఆలస్యమై నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు.

ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తున్నప్పటికీ వాహనాలు రేస్‌ ట్రాక్‌లోకి ప్రవేశించాయి. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో ట్రాక్‌పై రేసింగ్ కార్లు లేవు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాక్‌ను సిద్ధం చేయడానికి వాహనాలను క్లియర్ చేయడానికి నిర్వాహకులు వేగంగా చర్యలు చేపట్టారు.

నిన్నటి ప్రాక్టీస్ సెషన్‌లో , ఛాంపియన్‌షిప్ లీడర్ పాస్కల్ వెర్లీన్, ట్యాగ్ హ్యూయర్ పోర్స్చే డ్రైవర్, క్రాష్‌కు గురయ్యాడు. జర్మన్ డ్రైవర్ టర్న్ 18లో కారుపై నియంత్రణ కోల్పోయి, గోడను ఢీకొట్టడంతో కారు ముందు,వెనుక భాగం దెబ్బతింది. అయితే, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకుండా కారు దిగి వెళ్లడం కనిపించింది.

రేస్ ను చూసేందుకు వచ్చే ప్రేక్షకులు, అభిమానులు ఆహారం, పానీయం, పదునైన ఆయుధాలు, తుపాకులు , బాణసంచా, రసాయనాలు, ఏరోసోల్స్, వివిధ రకాల రాడ్లు, కర్రలు, డ్రోన్లు, రోలర్ స్కేట్‌లు, మాస్క్ లు, సూదులు, 500 మిల్లీలీటర్ల కంటే పెద్ద ప్లాస్టిక్ సీసాలు, గాజు సీసాలు, మొద్దుబారిన వస్తువులు, లేజర్ పాయింటర్లు, మద్య పానీయాలు తీసుకురావద్దని నిర్వాహకులు సూచించారు. ,

ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, (జల్ విహార్ నుండి ఇందిరా ప్రియదర్శిని గాంధీ విగ్రహం సర్కిల్ వరకు), NTR మార్గ్, మింట్ కాంపౌండ్ లేన్, IMAX రోడ్, సెక్రటేరియట్ నార్త్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అండర్‌పాస్ తదితర మార్గాల్లో వాహనాలు రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

First Published:  11 Feb 2023 2:50 AM GMT
Next Story