Telugu Global
Telangana

రిపబ్లిక్ డే రోజు కూడా రాజకీయాలేనా ? -గవర్న‌ర్ పై విమర్శ‌ల వర్షం

గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారని బీఆరెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ''కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము'' బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.

రిపబ్లిక్ డే రోజు కూడా రాజకీయాలేనా ? -గవర్న‌ర్ పై విమర్శ‌ల వర్షం
X

తెలంగాణ రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ రోజు గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మాట్లాడిన మాటలపై విమర్శలు కురుస్తున్నాయి. ఆమె దేశాభివృద్ది, రాష్టాభివృద్ది, రాజ్యాంగం తదితర అంశాలపై కాకుండ కేసీఆర్, బీఆరెస్ సర్కార్ పై విమర్శలు చేయడాన్ని అటు బీఆరెస్ నాయకులే కాకుండా, సోషల్ మీడియాలో నెటిజనులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.

గవర్నర్ మాట్లాడుతూ , తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని రోజుకు 22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాదు కేసీఆర్ పై పరోక్షంగా వ్యక్తి గత విమర్షలకు కూడా దిగారు. ''కొందరికి ఫార్మ్ హౌజ్ లు కాదు అందరికి ఫార్మ్ లు కావాలి'' అని ఆమె వ్యాఖ్యానించారు. ''అభివృద్ది అంటే భవనాలనిర్మాణం కాదు అభివృద్ది అంటే జాతి నిర్మాణం'' అని విమర్శించారు. మరో వైపు మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో దూసుకపోతోందని ఆమె అన్నారు.

నిజానికి రాజ్యాంగం అమలు లోకి వచ్చిన ఈ రోజు దేశంలో రాజ్యాంగం అమలవుతున్న తీరు గురించి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న విభజన, ద్వేష రాజకీయాల గురించి మాట్లాడాలని, ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వివిధ వర్గాల మధ్య రెచ్చ గొడుతున్నవైష‌మ్యాల గురించి మాట్లాడాలని, రాజ్యాంగం నిర్దేశించిన సంక్షేమ‍ విధానాలను నాశనం చేసి దేశాన్ని కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పిన విధానాల గురించి మాట్లాడాలని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవన్నీ వదిలేసి గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారని బీఆరెస్ నాయకులు

ఆరోపిస్తున్నారు. ''కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము'' బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఏ అభివృద్ది కోసమైతే కేసీఆర్ ఇప్పటి వరకు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారో గవర్నర్ అవే ప్రశ్నలు మళ్ళీ అడిగినందుకు ధన్యవాదాలు అని వ్యంగ్యంగా కవిత వ్యాఖ్యానించారు. భవన నిర్మాణాలు అభివృద్ది కాదన్న గవర్నర్ మాటలపై కవిత స్పందిస్తూ, కరోనామహమ్మారి దేశం లో అల్లకల్లోలం సృష్టించిన సమయంలో సెంట్రల్ విస్టా నిర్మాణం మీద కాకుండా దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని తమ‌ పార్టీ మోడీని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లాడారని రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ దిశగా గవర్నర్ ఇకనైనా పనిచేయాలని, రిపబ్లిక్ డే సందర్భంగా అయినా తీరు మార్చుకోవాలని ఆయన కోరారు. బీజేపీ చేతిలో పావుగా ఉండడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు.

First Published:  26 Jan 2023 7:11 AM GMT
Next Story