Telugu Global
Telangana

ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన సాగుతోంది : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ప్రతీ రంగంలో దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధించి ప్రగతి పథంలో దూసుకొని పోతోంది. ఈ విజయాలను స్మరించుకోవడానికే 21 రోజుల పాటు వేడుకల నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు.

ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన సాగుతోంది : సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని, 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా అనేక పథకాలు అమలు చేస్తూ, లక్ష్యాలను సాధిస్తూ ప్రజారంజకమైన పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ.. రాష్ట్రం గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ప్రతీ రంగంలో దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధించి ప్రగతి పథంలో దూసుకొని పోతోంది. ఈ విజయాలను స్మరించుకోవడానికే 21 రోజుల పాటు వేడుకల నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ విజయోత్సవ సంబరాల్లో ప్రజలందరూ పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అయితే, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపినప్పటి నుంచి ఇక్కడి ప్రజలు తమ అసమ్మతిని తెలియజేస్తూనే ఉన్నారన్నారు. 1971లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. ఆనాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఫలితంగా తెలంగాణ సమాజంలో పూర్తి నిరాశా నిప్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు ప్రయత్నించినా.. నాయకత్వం మీద విశ్వాసం లేకపోవడం, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు.

2001 వరకు తెలంగాణలో పూర్తిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదంలో జనం ఉన్నారు. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని అన్నారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు.. కులమతాలకు అతీతంగా ఐక్యంగా కదిలారని అన్నారు. వారందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరుల ఆశయాలను , ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైనట్లు కేసీఆర్ చెప్పారు. అటు పోరాటంలోనూ. ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్పూర్తినీ, అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషిని మననం చేసుకుందాం. దేశానికి దిక్సూచీగా నిలిచిన తెలంగాణ దశదిశలా చాటుదామని అన్నారు.

తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తు చేసుకుంటే.. ఏ రంగంలో చూసినా విధ్వంసమే కనపడుతుంది. అంతటా గాఢాంధకారమే గుర్తుకు వస్తుంది. అలాంటి అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయం అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏయే రంగాల్లో ధ్వంసం చేయబడిందో.. ఆ రంగాలన్నింటినీ చక్కదిద్ది సమాజాంలో అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టిందని అన్నారు. సమైక్య పాలకులు అనుసరించిన వివక్షాపూరిత విధానాలను మార్చివేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నదని చెప్పారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చూసుకుంటే.. మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ల ముందు కదలాడుతాయయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లలో.. కరోనా కారణంగా దాదాపు మూడేళ్ల కాలం వృధాగానే పోయింది. మిగిలిన ఆరేళ్లలో వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించిందని అన్నారు. ఇది నవీన తెలంగాణ. నవనవోన్మేష తెలంగాణ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలగాణ మోడల్ అనే మాట మార్మోగిపోతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా ప్రశంసలు అందుకుంటోంది. అనేక సవాళ్లు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. ఇవ్వాళ పరుగులు తీస్తోంది. అందుకు అంకిత భావంతో పని చేస్తున్న ప్రజా ప్రతినిదులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగుల, ప్రజల సహకారమే కారణమని సీఎం కేసీఆర్ అన్నారు.

అంతకు ముందు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించారు. అక్కడ పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.


First Published:  2 Jun 2023 6:16 AM GMT
Next Story