Telugu Global
Telangana

వరి ధాన్యం సాగులో ఈ సారి రికార్డు సృష్టించనున్న తెలంగాణ రైతులు!

నిరుటితో పోలిస్తే ఈ సారి వరి సాగు విస్తీర్ణం 2 లక్షల నుంచి 3 లక్షల హెక్టార్ల మేర పెరిగే అవకాశం ఉన్నది.

వరి ధాన్యం సాగులో ఈ సారి రికార్డు సృష్టించనున్న తెలంగాణ రైతులు!
X

తెలంగాణ రైతాంగం ఈ ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది 26 లక్షల హెక్టార్లలో (దాదాపు 65 లక్షల ఎకరాలు) వరి ధాన్యం సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిరుటితో పోలిస్తే ఈ సారి వరి సాగు విస్తీర్ణం 2 లక్షల నుంచి 3 లక్షల హెక్టార్ల మేర పెరిగే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలో వర్షాలు ఆలస్యం కావడంతో వ్యవసాయ పనులు మందకొడిగా ప్రారంభం అయ్యాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతం మినహా మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవడంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ఆలస్యంగా అయినా వ్యవసాయ పనులు ప్రారంభించారు. కాగా, ఈ సారి ఎక్కువ మంది రైతులు పత్తి బదులు వరి ధాన్యం వేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. పత్తితో పోలిస్తే వరి ధాన్యానికి ఎక్కువ డిమాండ్, ధర లభిస్తుండటంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ సారి పత్తి 18 లక్షల నుంచి 20 లక్షల హెక్టార్లలోపే సాగు చేసే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలో ఇప్పటికే 16 లక్షల హెక్టార్లలో వరి నార్లు వేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 12 లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేయగా.. ఈ సారి నాలుగు లక్షల హెక్టార్ల విస్తీర్ణం పెరిగింది. స్వాతంత్ర దినోత్సవం రోజు సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంలో కూడా వరి సాగు విషయంలో ఈ ఏడాది రాష్ట్రం 26 లక్షల హెక్టార్ల మార్కును దాటుతుందని చెప్పారు.

ఇక మిగిలిన 26 లక్షల హెక్టార్లలో పత్తి 20 లక్షల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉన్నది. మొక్కజొన్న, మిర్చి, ఇతర తృణ ధాన్యాలు మిగిలిన భూమిలో సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2022-23 ఆహార ఉత్పత్తికి సంబంధించిన మూడో ముందస్తు అంచనాల మేరకు తెలంగాణలో 175.27 లక్షల టన్నుల వరి దిగుబడి రానున్నది. ఇక పత్తి 58.54 లక్షల బేళ్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లలో తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014-15లో సరాసరి స్థూల సాగు విస్తీర్ణం 131 లక్షల ఎకరాలుగా ఉండగా.. 2021-22లో 198 లక్షల ఎకరాలకు పెరిగింది. సాగుభూమి విస్తీర్ణం పెరగడంతో రాష్ట్రంలో పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 2014-15లో 2.32 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా.. 2021-22లో 52 శాతం మేర పెరిగి 3.26 కోట్ల టన్నులకు చేరినట్లు అధికారులు తెలిపారు.

వరిధాన్యం సాగు 180 శాతం మేర పెరిగింది. 2014-15లో 35 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 2021-22లో ఏకంగా 98 లక్షల ఎకరాలకు పెరిగింది. పత్తి సాగు కూడా 42 లక్షల ఎకరాల నుంచి 47 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక రాష్ట్రంలో సాగు అవుతున్న వరి ధాన్యం ధర కూడా ఎక్కువగానే ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ లెక్కల ప్రకారం క్వింటాల్‌కు రూ.1,980 నుంచి రూ.2.060 వరకు పలుకుతోంది. అదే గ్రేడ్ ఏ రకానికి రూ.2,060 నుంచి రూ.2,460 వరకు పలుకుతున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల వరినాట్లు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు మరోసారి నారు వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వర్షాలు తిరిగి కురుస్తుండటంతో వరి సాగు ఊపందుకున్నది.

First Published:  18 Aug 2023 5:43 AM GMT
Next Story