Telugu Global
Telangana

దేశ రాజకీయ యవనికపై మొదలుకానున్న చైతన్య ఝరి...ఇక‌ బీఆరెస్ ప్రస్థానం ప్రారంభం

టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చేందుకు ఆమోదిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం సాయంత్రం టీఆరెస్ అధ్యక్షులు కెసిఆర్ కు లేఖ పంపింది. బిఆర్ ఎస్ ను అధికారికంగా రేపు కెసిఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు.

దేశ రాజకీయ యవనికపై మొదలుకానున్న చైతన్య ఝరి...ఇక‌ బీఆరెస్ ప్రస్థానం ప్రారంభం
X

14 ఏళ్ళ పోరాటం, గెలుపులు, ఓటములు, అవమానాలు, చీత్కారాలు, నిర్భందాలు..అన్ని‍ంటినీ దాటుకొని తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం స్వరాష్ట్రాన్ని సాధించి....ఎనిమిదేళ్ళ పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు దేశ‌ రాజకీయాల్లో సమూల మార్పుకోసం ధైర్యంగా , స్థిరంగా మరో అడుగు ముందుకేసింది. ఆ అడుగు పేరే 'భారత రాష్ట్ర సమితి'. తెలంగాణ కోసం నలుగురితో మొద‌లైన కేసీఆర్ లక్షల మందిని కదిలించినట్టు. రేపు బీఆరెస్ దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నది. కోట్లాది గుండెలను కదిలించబోతున్నది. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో మరో రాజకీయ పార్టీలా కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయాలను అమలుచేయబోతున్నది.

టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చేందుకు ఆమోదిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం సాయంత్రం టీఆరెస్ అధ్యక్షులు కెసిఆర్ కు లేఖ పంపింది. బిఆర్ ఎస్ ను అధికారికంగా రేపు కెసిఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు. శుక్ర‌వారంనాడు మ‌ద్యాహ్నం గం.1.20 నిమిషాల‌కు ముఖ్య‌మంత్రి కెసిఆర్ లేఖ పై సంత‌కం చేసి బిఆర్ఎస్ జెండాను ఆవిష్క‌రించ‌నున్నారు. పార్టీ జెండా లో భార‌త‌దేశ చిత్రం ఉంటుంది. జెండా గులాబి రంగుగులోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. బిఆర్ఎస్ ను అధికారికంగా గుర్తిస్తూ ఎన్నిక‌ల సంఘం త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది.

రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌క‌ల్లా ముఖ్య‌నేత‌లంతా తెలంగాణ భ‌వ‌న్ కు చేరుకోవాల‌ని స‌మాచారం పంపారు. అలాగే వివిధ రాష్ట్రాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు కూడా ఈ మేర‌కు స‌మాచారం ఇచ్చారు. వీరంతా రేప‌టికి హైద‌రాబాద్ చేరుకోనున్నారు. రేపు అధికారికంగా బిఆర్ ఎస్ ఆవిర్భావ సంబురాలు నిర్వ‌హించ‌నున్నారు.

దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో టిఆర్ ఎస్ త‌ర‌హా రాజ‌కీయ విధానాలు అవ‌స‌ర‌మ‌ని టిఆర్ ఎస్ అధినేత‌, ముక్య‌మంత్రి కెసిఆర్ భావించారు. అందుకు అనుగుణంగా అక్టోబ‌ర్ 5 వ తేదీన టిఆర్ ఎస్ ను బిఆర్ ఎస్ గా మారుస్తూ తీర్మానం చేసి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమోదిస్తూ నేడు కెసిఆర్ కు లేఖ‌ పంపింది. దీంతో ఇక బిఆర్ ఎస్ దేశ రాజ‌కీయాల్లో విప్ల‌వాత్మ‌క పాత్ర‌క పోషించేందుకు వీలు క‌లిగింది.తెలంగాణ రాష్ట్ర స‌మితి(టిఆర్ ఎస్‌) ఇక‌ భార‌త రాష్ట్ర స‌మితిగా (బిఆర్ఎస్‌) దేశ రాజ‌కీయాల్లో కీల‌కంగా మార‌నున్న‌ది.


First Published:  8 Dec 2022 1:14 PM GMT
Next Story