Telugu Global
Telangana

తెలంగాణలో పాఠశాలల వేళల మార్పుపై కసరత్తు చేస్తున్న విద్యా శాఖ

ప్రైమరి, అప్పర్ ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు పొద్దున్నే నిద్రలేవరని.. వారికి ఉదయం 9.00 గంటలకే పాఠశాల ప్రారంభించడం వల్ల చాలా మంది లేటుగా వస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

తెలంగాణలో పాఠశాలల వేళల మార్పుపై కసరత్తు చేస్తున్న విద్యా శాఖ
X

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల వేళల మార్పుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఇక ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మాత్రం పాఠశాలలు ఇంకొంచెం ముందుగానే ప్రారంభం అవుతాయి.

ప్రైమరి, అప్పర్ ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు పొద్దున్నే నిద్రలేవరని.. వారికి ఉదయం 9.00 గంటలకే పాఠశాల ప్రారంభించడం వల్ల చాలా మంది లేటుగా వస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పరస్పర విరుద్దమైన టైమింగ్స్ అమలులో ఉన్నాయని వారు విద్యా శాఖ దృష్టికి తీసుకొని వెళ్లారు. పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులకు తెలిపారు. అన్ని పాఠశాలలను ఉదయం 9.30కే తెరిచేలా చూడాలని కోరారు.

ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనను ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులు లేట్‌గా రావడానికి టైమింగ్స్ ఏమైనా కారణమా అనే విషయంపై అధ్యయనం జరుగుతోంది. ఆ తర్వాత పాఠశాలల వేళల మార్పు విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కాగా, స్కూల్ టైమింగ్స్ మార్చే విషయంలో కొంత మంది వేరే వాదనలు కూడా వినిపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు ఉదయం 8.30కే ప్రారంభం అవుతున్నాయని, స్కూల్ బస్సులు ఉదయం 7.30 నుంచే పిల్లలను తీసుకెళ్లడానికి వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్ మార్చితే పేరెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేరెంట్స్ ఉదయాన్నే పొలం పనులు, ఇతర పనులకు వెళ్తారని.. అలాంటప్పుడు విద్యార్థులకు ఇప్పుడున్న టైమింగ్సే కరెక్ట్‌గా ఉంటాయని వాదిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని ఊర్లలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సొంత ఊరి పిల్లలే ఈ పాఠశాలకు వస్తారు. అందుకే త్వరగా ప్రారంభించినా నష్టం లేదని చెబుతున్నారు. హైస్కూల్స్ మాత్రం అన్ని గ్రామాల్లో ఉండవు. పక్కన ఉండే ఊర్ల నుంచి కూడా పిల్లలకు పాఠశాలకు వస్తారు. అందుకే దాని టైమింగ్స్ కాస్త ఆలస్యంగా పెట్టారని అంటున్నారు. ఏదేమైనా పాఠశాలల వేళల మార్పుపై నిర్ణయం తీసుకునే ముందు విద్యారంగ నిపుణులతో చర్చించాలని సూచిస్తున్నారు.

First Published:  24 Jun 2023 8:54 AM GMT
Next Story