Telugu Global
Telangana

టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాలపై హైకోర్టుకు క్లారిటీ ఇచ్చిన బోర్డు

రాష్ట్ర స్థాయి పోస్టులైన స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను గత నోటిఫికేషన్లకు భిన్నంగా జిల్లా స్థాయి పోస్టులుగా నియమించేందుకు జారీ అయిన జీవో 46ను కొట్టేయాలని కోరుతూ 20 మంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాలపై హైకోర్టుకు క్లారిటీ ఇచ్చిన బోర్డు
X

పోలీస్ కానిస్టేబుళ్ల నియామకంపై హైకోర్టుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం చేసేందుకే జీవో 46ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. రాష్ట్రంలో 5వేల పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగబోదని హైకోర్టుకు తెలిపారు. జనాభా దామాషా ప్రకారమే పోస్టులు కేటాయించి.. కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ల వారీగా నియామకాలు జరుపుతున్నట్లు వివరించింది.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)కు చెందిన దాదాపు 5 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా లేదా కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ (సీడీసీ) పోస్టులుగా గుర్తించి నియామకాలు చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర స్థాయి పోస్టులైన స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను గత నోటిఫికేషన్లకు భిన్నంగా జిల్లా స్థాయి పోస్టులుగా నియమించేందుకు జారీ అయిన జీవో 46ను కొట్టేయాలని కోరుతూ 20 మంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చెప్పింది. అంతే కాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసే వరకు పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల ఫలితాలను విడుదల చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కౌంటర్ దాఖలు చేసింది.

అభివృద్ధి చెందిన, పట్టణ ప్రాంత జిల్లాలకు మాత్రమే కాకుండా.. అన్ని జిల్లాలకు సమన్యాయం చేసేందుకే జీవో 46ను జారీ చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఈ జీవో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు (2018)కు లోబడే ఉన్నదని.. గత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి పాత ఉత్తర్వుల ప్రకారం ఇచ్చినవని పేర్కొన్నది. పిటిషనర్లు కోరినట్లు స్టేల్ లేదా కాంటిజియస్ డిస్ట్రిక్ట్ స్థాయిలో నియామకాలు జరిపితే.. అభివృద్ధి చెందిన జిల్లాల వారే ఎక్కువగా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. వెనుకబడిన జిల్లాల అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని హైకోర్టుకు స్పష్టం చేసింది.

First Published:  20 Sep 2023 2:52 AM GMT
Next Story