Telugu Global
Telangana

అధికారులు ఇరకాటంలో పడ్డారా?

మామూలుగా అయితే విచారణ ప్రోగ్రెస్‌ను ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు రిపోర్టు చేస్తుంటారు. అలాంటిది గవర్నర్ ఏకంగా నివేదికనే కోరారు. ఒకవైపు కేసీఆర్‌ పర్యవేక్షిస్తున్న కేసునే మరోవైపు గవర్నర్ రిపోర్టు కావాలని అడగటం విచిత్రంగానే ఉంది. ఇప్పుడు రిపోర్టును కేసీఆర్‌కు సబ్మిట్ చేయాలా? లేకపోతే గవర్నర్‌కు సబ్మిట్ చేయాలా అన్నది ఉన్నతాధికారులను ఇరకాటంలో పడేస్తోంది.

అధికారులు ఇరకాటంలో పడ్డారా?
X

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆదేశాలతో ఉన్నతాధికారులు ఇరకాటంలో పడిపోయారా? జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన వివిధ రకాల ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లీకైన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను నియమించింది. సిట్ ఉన్నతాధికారులు అనేక కోణాల్లో ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న ప‌లువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సరిగ్గా ఈ సమయంలో గవర్నర్ యాక్టివ్ అయ్యారు. విచారణ నివేదికను తనకు 48 గంటల్లో అందించాలని సిట్ ఉన్నతాధికారులను, చీఫ్ సెక్రటరీ, టీఎస్‌పీఎస్సీ బోర్డు ఛైర్మన్, డీజీపీ అంజనీకుమార్, సిట్ ఉన్నతాధికులను ఆదేశించారు. అలాగే గ్రూప్ 1 పరీక్షల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాసిన పేపర్లను కూడా తనకు ఇవ్వాలని చెప్పారు. ఇంకా ఇలాంటి అనేక ఆదేశాలను గవర్నర్ జారీ చేశారు. ఇప్పటివరకు సిట్ విచారణ అంతా గోప్యంగానే జరుగుతుంది. విచారణ ఎప్పుడు గోప్యంగానే జరుగుతుంది. నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాతే అది బహిర్గతమవుతుంది.

విచారణ మధ్యలోనో లేకపోతే చివరి దశలో ఉన్నపుడు నివేదికను తనకు తెచ్చివాలని గవర్నర్ ఆదేశించటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు సిట్ విచారణను కేసీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. విచారణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులిచ్చింది. రేవంత్ విచారణకు హాజరయ్యారు. అదుపులోకి తీసుకున్నవారిలో కొందరి పాత్రపై ఆధారాలున్నాయని సిట్ భావిస్తోంది. కొద్ది రోజుల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులను కోర్టులో ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలో విచారణ వివరాలు మొత్తాన్ని తనకు సబ్మిట్ చేయాలని ఆదేశించటం ఏమిటో అర్థంకావటం లేదు. మామూలుగా అయితే విచారణ ప్రోగ్రెస్‌ను ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు రిపోర్టు చేస్తుంటారు. అలాంటిది గవర్నర్ ఏకంగా నివేదికనే కోరారు. ఒకవైపు కేసీఆర్‌ పర్యవేక్షిస్తున్న కేసునే మరోవైపు గవర్నర్ రిపోర్టు కావాలని అడగటం విచిత్రంగానే ఉంది. ఇప్పుడు రిపోర్టును కేసీఆర్‌కు సబ్మిట్ చేయాలా? లేకపోతే గవర్నర్‌కు సబ్మిట్ చేయాలా అన్నది ఉన్నతాధికారులను ఇరకాటంలో పడేస్తోంది. గవర్నర్ -కేసీఆర్‌ మధ్య సంబంధాలు సరిగా లేకపోవటం ఉన్నతాధికారులకు బాగా ఇబ్బందిగా తయారైంది. మరి తాజా ఆదేశాల తర్వాత సిట్ ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాల్సిందే.

First Published:  24 March 2023 6:20 AM GMT
Next Story