Telugu Global
Telangana

సీట్ల విషయంలో కాంగ్రెస్, పొంగులేటి వర్గానికి మధ్య కుదిరిన ఒప్పందం!

పొంగులేటి వర్గంతో కాంగ్రెస్ నాయకులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు నాలుగు సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తున్నది.

సీట్ల విషయంలో కాంగ్రెస్, పొంగులేటి వర్గానికి మధ్య కుదిరిన ఒప్పందం!
X

బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. గత కొంత కాలంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ వచ్చారు. అయతే పొంగులేటి వర్గం తమకు 15 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు కావాలని డిమాండ్లు పెట్టింది. బీజేపీ ముందు అయితే.. జాతీయ స్థాయిలో పార్టీ పరంగా కీలక పదవులు కావాలని కూడా డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా పొంగులేటి వర్గంతో కాంగ్రెస్ నాయకులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు నాలుగు సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సీట్లను పొంగులేటి వర్గానికే కేటాయిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నాలుగింటిలో కొత్తగూడెం తప్ప మిగిలినవి అన్నీ ఎస్టీ రిజర్వుడు స్థానాలే.

ఇక ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి (ఎస్సీ) స్థానాన్ని పొంగులేటి వర్గం కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తున్నది. కాగా, సర్వే నివేదికలను బట్టి సత్తుపల్లి సీటు కేటాయించాలా లేదా అనేది నిర్ణయిద్దామని పొంగులేటి వర్గానికి చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి. ఈ మూడు కూడా తమకు కేటాయించమని గతంలో కోరారు. అయితే కొత్తగూడెం మాత్రమే కేటాయించి.. పాలేరు, ఖమ్మం విషయంలో మాత్రం తలొగ్గలేదు.

జూపల్లి కృష్ణారావు గతంలో ప్రాతినిథ్యం వహించిన కొల్లాపూర్ నియోజకవర్గం టికెట్ కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉన్నది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్థన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు. దీంతో జూపల్లికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే విషయంలో ఎలాంటి అభ్యంతరం ఉండదని భావిస్తున్నారు.

పొంగులేటి వర్గం ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ టికెట్లను కూడా తమకు కేటాయించమని కోరినా.. సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో.. ఆ చర్చను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. మొత్తానికి 15 సీట్లను డిమాండ్ చేయగా.. చివరకు 4 సీట్లను కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకున్నది. సత్తుపల్లి విషయంలో మాత్రం నిర్ణయం పెండింగ్‌లో పెట్టింది. అది కూడా కేటాయిస్తే మొత్తం ఐదు సీట్లు పొంగులేటి వర్గానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటాయించినట్లు అవుతుంది. అయితే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే భట్టి, రేణుక వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. అందుకే పొంగులేటిని పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పరిమితం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.


సత్తుపల్లి ఎస్సీ రిజర్వు సీటు కనుక పొంగులేటికి కేటాయిస్తే.. భట్టి వర్గం వ్యతిరేకించే అవకాశం ఉన్నది. అందుకే ప్రస్తుతానికి దాన్ని పెండింగ్ పెట్టినట్లు తెలుస్తున్నది. మరోవైపు పాలేరు జనరల్ స్థానంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వదిలేయాలని.. అక్కడ కాంగ్రెస్ ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తున్నది. దీనిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని.. తాము ఏమీ చేయలేమని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే డీకే శివకుమార్‌తో పాలేరు విషయాన్ని మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి తన నిర్ణయాన్ని చెబుతారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఎవరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడో కూడా స్పష్టం చేస్తారని తెలుస్తున్నది.

First Published:  13 Jun 2023 12:02 PM GMT
Next Story